తెలంగాణ ఎన్నికల నేపధ్యంలో జన సేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నట్టు ఆయన ఇదివరకే ప్రకటించారు. అయితే అక్కడ ఎన్నికలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది. తెలంగాణలో నవంబర్ 30 న ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ పొత్తులపై మాత్రం పవన్ కళ్యాణ్ నిన్నమొన్నటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. తాజా పరిణామాలను చూస్తే….. ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీనికోసం ఆయన ఢిల్లీ వెళుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
తొలుత తెలంగాణ ఎన్నికలలో సొంతంగా పోటీ చేయాలని ఆ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి తెచ్చారు. 32 స్థానాలలో పోటీ చేయాలనుకుంటున్నట్టు ప్రకటించేసారు కూడా. పార్టీ నాయకుల అభిప్రాయాలను విన్న పవన్ కళ్యాణ్ .. ఓ నిర్ణయం తీసుకోవటానికి కొంత సమయం కావాలని వారికి చెప్పి సముదాయించారు. జన సేన నేతల వైఖరిని గమనించిన బీజేపీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. పవన్ కళ్యాణ్ తో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే.లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఉమ్మడిగా పోటీ చేస్తే బాగుంటుందని వారు చెప్పినట్టు సమాచారం.
జన సేన అధినేత పవన్ కళ్యాణ్ హస్తిన వెళుతున్నారన్న వార్త… తెలంగాణలో బీజేపీతో జనసేన జట్టు కడుతుందన్న అంచనాలకు బలం చేకూరుస్తోంది. అక్కడ ఆయన బీజేపీ అగ్ర నేతలతో చర్చలు జరిపాక దీనిపై క్లారిటీ రానుంది. అయితే తెలంగాణలో పవర్ స్టార్ అభిమానుల ఓట్లను దక్కించుకోవడానికి.. మరో వైపు ఏపీలో జన సేన ముందరి కాళ్లకు బంధం వేయడానికే బీజేపీ పొత్తు ఎత్తును వేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సుముఖంగా లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ వ్యూహం వేరే విధంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణలో పొత్తుకు ఇప్పుడు అంగీకరిస్తే భవిష్యత్తులో ఏపీలో బీజేపీని కలుపుకోవటానికి ఉపయోగపడుతుందని ఆయన అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు పొత్తుకు తాను ఒప్పుకుంటే తర్వాత ఏపీలో పొత్తుకు బీజేపీ అగ్ర నాయకత్వంపై ఒత్తిడి తేవచ్చని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టు ఉందంటున్నారు. దీని వల్ల ఏపీ సీఎం అభ్యర్థిగా కూడా ప్రొజెక్ట్ అవడానికి అవకాశం ఏర్పడుతుందని చెబుతున్నారు. మరి పవన్ వ్యూహం ఇదే అయితే ఎంత వరకు ఫలిస్తుందో .. వేచి చూడాలి.
Discussion about this post