తెలంగాణలోని హాట్ సీట్లలో కొడంగల్ ఒకటి. ఇక్కడి రాజకీయం.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే భిన్నంగానూ, అందరి దృష్టిని ఆకర్షించే విధంగానే ఉంటుంది. పైగా.. కొడంగల్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో.. అందరి దృష్టి కొడంగల్ పైనే పడింది. గతఎన్నికల్లో ఇక్కడి ఓడిపోయిన రేవంత్ ఈసారి గెలవాలని గట్టి కృషి చేస్తున్నారు. రేవంత్ .. కామారెడ్డి లో కూడా నామినేషన్ వేశారు. అక్కడ కేసీఆర్ తో తలపడుతున్నారు. గత ఎన్నికల్లో కొడంగల్ లో రేవంత్‌కు చెక్ పెట్టి గెలుపు జెండా ఎగరేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. మరి.. ఈసారి అక్కడ ఎవరు గెలుస్తారనేది.. హాట్ టాపిక్‌గా మారింది. కొడంగల్‌పై.. రేవంత్ రెడ్డి మళ్లీ పట్టు సాధిస్తారా? లేక పట్నం నరేందర్ రెడ్డే.. మరోసారి గెలిచి.. సత్తా చాటుతారా? అన్నఅంశం ఆసక్తి రేపుతోంది.
కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న కొడంగల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఇప్పటివరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే.. ఆరు సార్లు కాంగ్రెస్, ఐదు సార్లు టీడీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. తొలిసారి.. 2018 ఎన్నికల్లో.. కొడంగల్ ప్రజలు అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించారు.ఇక్కడ మొత్తం 2 లక్షల 16 వేల మందికిపైనే ఓటర్లున్నారు. మొదట్నుంచి.. తెలంగాణలో బాగా వెనుకబడిన ప్రాంతంగా కొడంగల్‌కు పేరుంది. రాష్ట్రానికి మారుమూలన ఉండే ఈ ప్రాంతం.. ఇప్పటికీ అనేక సమస్యలను ఎదుర్కొంటోంది.
ఇక్కడ రాజకీయాల విషయానికొస్తే.. మిగతా ప్రాంత రాజకీయాల కంటే భిన్నంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కొడంగల్‌లో టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత.. సీన్ మారింది. 2014లో టీడీపీ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా రాజకీయం మారింది. గత ఎన్నికల నుంచి.. కొడంగల్ రాజకీయం.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా మారిపోయింది. ముందు నుంచీ.. ఈ నియోజకవర్గంలో ప్రధాన పోటీ రెండు పార్టీల మధ్యే ఉంటూ వస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే గట్టి పోటీ నెలకొంది.
2014 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి బరిలోకి దిగారు. నాటి trs అభ్యర్థి గురునాథ్ రెడ్డి .. కాంగ్రెస్ అభ్యర్థి డి . విఠలరావు ల పై రేవంత్ 14,614 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. అంతకుముందు 2009 లో రేవంత్ టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. 2018 లో మాత్రం brs అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో 9319 ఓట్ల తేడాతో రేవంత్ ఓడిపోయారు. ఆ తర్వాత అయిదు నెలలకు జరిగిన లోక సభ ఎన్నికల్లో మల్కాజగిరి నియోజకవర్గం నుంచి రేవంత్ విజయం సాధించారు.
ఇక ప్రస్తుత ఎన్నికల్లో నరేందర్ రెడ్డి .. రేవంత్ రెడ్డి ల మధ్యే హోరాహోరీ పోరు జరగనుంది. ఇటు కాంగ్రెస్ అటు బీ ఆర్ ఎస్ నేతలు వ్యూహ, ప్రతివ్యూహాల్లో నిమగ్నమైనారు. టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి.. స్టేట్‌తో పాటు కొడంగల్ పైనా ఫోకస్ పెట్టారు. వరుసగా.. ముఖ్య కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తూ.. క్యాడర్‌ని ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. గ్రామాలు, వార్డుల వారీగా కమిటీలు పటిష్టం చేసుకుంటూ జనంలోకి వెళ్తున్నారు.
మరోవైపు.. బీఆర్ఎస్ కూడా ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.. అన్ని గ్రామాలను చుట్టేస్తున్నారు. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేశారు. తాను కొడంగల్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపించానంటున్నారు నరేందర్ రెడ్డి. 80 శాతం బీటీ రోడ్లు పూర్తి చేశామని.. 40 ఎకరాల్లో ఐటీ పార్క్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపామని చెబుతున్నారు. మొత్తం మీద ఈ సారి పోరు మాత్రం తీవ్రం గానే జరిగేలా ఉంది. ప్రజల మొగ్గు ఎలా ఉంటుందో ఫలితాలు వచ్చాకనే తెలుస్తుంది
Discussion about this post