ఎన్నికల సమయంలో పార్టీలకు సీట్ల సర్దుబాటు సమస్య ఎదురవటం కామనే. కానీ ఇప్పుడు కొన్ని ఐటీ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు ఆఫీసుల్లో సీట్ల కోసం పాట్లు పడుతున్నారు. కోవిడ్ సమయంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దతిని అమలు చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు ఈ విధానాన్ని కొనసాగించాయి. ఉద్యోగులు ఇళ్ల నుంచి పనిచేస్తుండటంతో ఆఫీసులను పెద్దగా విస్తరించలేదు. ఉద్యోగుల సంఖ్య పెరిగినా అందుకు తగినట్టు సీట్లను ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు చాలా సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దతిని విరమించుకుంటున్నాయి. దీంతో సమస్య తలెత్తుతోంది.
కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని అనుసరిస్తుండగా టీసీఎస్ మాత్రం ఉద్యోగులందరూ ఆఫీసులకు రావాల్సిందేనని తేల్చి చెప్పేసింది. ఫలితంగా ఉద్యోగులందరూ కార్యాలయాలకు వస్తుండటంతో సీట్ల కొరత తలెత్తుతోంది. వారికి కేటాయించిన సీట్లపై గందరగోళం నెలకొంది. గత రెండేళ్లలో టీసీఎస్ లక్ష మంది ఉద్యోగులను చేర్చుకుంది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 6 లక్షలు దాటింది. దీనివల్ల సీట్ల సమస్య తప్పటం లేదు.
అకేషనల్ ఆక్యుపేషన్ జోన్లుగా పిలిచే ఉద్యోగుల తాత్కాలిక సీటింగ్ సౌకర్యాలను టీసీఎస్ తొలగించడం వల్ల సమస్య మరింత తీవ్రమైంది. దీంతో కొందరు ఆఫీస్ కారిడార్లు, లాబీల్లో కూర్చొని పనిచేసుకోవాల్సి వస్తోంది. దీనిపై మీడియాలో వార్తలొస్తున్నా యాజమాన్యం స్పందించటం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. అయితే అధికారుల వాదన మరోలా ఉంది. రిటర్న్-టు-ఆఫీస్ మార్పును దారిలో పెట్టి, ఉద్యోగులందరికీ సౌకర్యంగా ఉండేలా చేయడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నంలో ఇది భాగమని చెబుతున్నారు.
Discussion about this post