తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఈ నెల 30 న పోలింగ్ జరగబోతోంది. దానికి 48 గంటల ముందే ప్రచారానికి తెర పడుతుంది. అంటే పోటీలో ఉన్న రాజకీయ పార్టీలకు గట్టిగా మూడు వారాలే సమయం ఉంది. అందుకే అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ అటు అభ్యర్థుల ఎంపిక.. ప్రచారంలోను.. ఇటు మేనిఫెస్టోల ప్రకటనతోను దూసుకుపోతున్నాయి. కానీ బీజేపీ మాత్రం అన్ని విషయాల్లోనూ వెనుకబడిఉండటం పార్టీ కార్యకర్తలకు ఆందోళన, ఆవేదన కలిగిస్తోంది.
మూడో సారి కూడా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
అక్టోబర్ 15 న పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. దీనికి దీటుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అక్టోబర్ 29 న ఆరు ప్రధాన హామీలతో తొలి మేనిఫెస్టోను వెల్లడించారు. అంతకు ముందే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయిదు హామీలతో యూత్ డిక్లరేషన్ ను ప్రకటించారు.
తెలంగాణ బీజేపీ ఇంతవరకు తన మేనిఫెస్టోను ప్రకటించలేదు. పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎంగా చేస్తామని మాత్రం ప్రకటించింది. తర్వాత మేనిఫెస్టో పై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మేనిఫెస్టో లేకుండానే పార్టీ ఎన్నికలకు వెళ్తుందా.. అని పార్టీ కేడర్ ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఈ అనిశ్చితికి తెలంగాణలో బీజేపీ వేసిన కమిటీలు ఖాళీ అవుతుండటమే కారణమని పరిశీలకులు చెబుతున్నారు. అక్టోబర్ 5న బీజేపీ మొత్తం 14 ఎన్నికల కమిటీలను ప్రకటించింది. అసంతృప్త నేతలకు వాటిలో ప్రాధాన్యత కల్పించింది. కానీ.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్గా నియమించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్గా నియమించిన గడ్డం వివేక్ వెంకటస్వామి కూడా అదేబాటలో నడిచారు.
హెడ్ క్వార్టర్స్ కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ అయిన ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్ గా నియమితులవటంతో ఆ పోస్టు ఖాళీ అయింది. ఏజిటేషన్ కమిటీ చైర్మన్ విజయశాంతి మొదటి నుంచే దూరంగా ఉంటున్నారు. మిగిలిన కమిటీల వారూ క్రియాశీలకంగా పనిచేస్తున్నట్టు కనపడటం లేదంటున్నారు.
ఆయా కమిటీల కో-కన్వీనర్లు సైతం ఆక్టివ్ గా పనిచేయడం లేదని అంటున్నారు. మేనిఫెస్టో కమిటీ కో కన్వీనర్ గా ఉన్న మహేశ్వర్ రెడ్డి తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఎస్సీ నియోజకవర్గాల కో ఆర్డినేషన్ కమిటీ పరిస్థితి దయనీయంగా ఉంది. కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని వెతుక్కోలేని స్థితిలో కమిటీ ఉందంటున్నారు. ఎస్సీ నియోజకవర్గాల కోఆర్డినేషన్ కమిటీ ఛైర్మన్ జితేందర్ రెడ్డి పాలమూరు నియోజకవర్గానికే పరిమితమయ్యారని అంటున్నారు.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలను పార్టీ ఎలా ఎదుర్కొంటుందోనని బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మేనిఫెస్టోను ప్రకటించి ఓటర్ల మద్దతు పొందటానికి గట్టిగా కృషి చేయాలని కోరుతున్నారు
Discussion about this post