రొమ్ము క్యాన్సర్ బాధితులే కాదు దానిబారిన పడే ప్రమాదం ఉన్నవారు కూడా ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మంచి మందులు, చికిత్సా విధానాలు అందుబాటులో ఉండగా ఇంగ్లాండ్ లో జరిగిన తాజా పరిణామం బాధితులకు మరింత మనో ధైర్యాన్ని ఇస్తుంది. జీవితంపై ఎంతో భరోసానిస్తుంది. నిజంగా ఇది వారికి శుభవార్తే.
ఇప్పటివరకు వ్యాధి చికిత్సకు వినియోగిస్తున్న అనస్ట్రోజోల్ మాత్రను ఇకపై వ్యాధి రాకుండా నిరోధించటానికి ముందస్తుగా వినియోగించేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతం ఇంగ్లండ్ లో ఇది అమలుకానుండగా క్రమేణా ప్రపంచ దేశాల్లో కూడా అమలు చేసే అవకాశం ఉంది. అనస్ట్రోజోల్ ముందస్తు వినియోగం వల్ల రొమ్ము క్యాన్సర్ కేసులు గణనీయంగా తగ్గుతాయని, చికిత్స వ్యయం కూడా తగ్గుతుందని ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
తాజాగా ఇంగ్లాండ్ లో నిర్వహించిన ట్రయల్స్‌లో మెనోపాజ్ దశను దాటిన మహిళలు దీనిని తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడే ప్రమాదం 50 శాతం మేర తగ్గినట్టు వెల్లడయింది. వారసత్వంగా క్యాన్సర్ సోకే ప్రమాదం ఉన్న మహిళల ఆరోగ్య సంరక్షణలో ఇది “ముఖ్యమైన అడుగు” అని స్వచ్ఛంద సంస్థలు అంటున్నాయి. అంతేకాకుండా అనస్ట్రోజోల్ పై ఎలాంటి పేటెంట్ హక్కులు లేవు. అంటే ఏ సంస్థ అయినా దీనిని తయారుచేయవచ్చు. ఈ మందు తయారీకి అయ్యే వ్యయం కూడా చాలా తక్కువ. ఒక మాత్రకు అయ్యే ఖర్చు పైసల్లోనే ఉంటుందని ఫార్మా రంగ నిపుణులు చెబుతున్నారు.
మెడిసిన్స్-రీపర్పసింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఔషధాలు, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల నియంత్రణ సంస్థ ద్వారా ఇంగ్లండ్ నేషనల్ హెల్త్ సర్వీస్ అనస్ట్రోజోల్ ముందస్తు వినియోగానికి లైసెన్స్ పొందింది. క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉన్నవారికి ఈ మందు ఆశాకిరణమని ఎన్‌హెచ్ఎస్ క్లినికల్ డైరెక్టర్ ఫర్ క్యాన్సర్ ప్రొఫెసర్ పీటర్ జాన్సన్ చెప్పారు.
ఇండియాలోని మహిళల్లో ఎక్కువగా కన్పించే కేన్సర్ ఇదే. అయితే ఈ వ్యాధిపై క్రమేణా అవగాహన పెరుగుతోంది. కొత్త కొత్త చికిత్సా విధానాలు, మందులు అందుబాటులోకి రావటంతో చాలామంది మహిళలు దీనినుంచి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనస్ట్రోజోల్ ముందస్తు వినియోగానికి అనుమతి లభించటం మంచి పరిణామమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల బాధితులకు మరింత భరోసా లభిస్తుందని చెబుతున్నారు.
Discussion about this post