తెలంగాణలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీలు దూకుడు పెంచుతున్నాయి. ప్రచారానికి రెండున్నర వారాలే ఉండటంతో మూడు పార్టీల అగ్ర నేతలు హెలికాఫ్టర్ల వినియోగాన్ని పెంచుతున్నారు. దీంతో ఆయా పార్టీలకు బిల్లు తడిసి మోపెడవుతోంది. ఈ నేపథ్యంలో హెలికాఫ్టర్ల చార్జీలు ఎలా ఉంటాయన్నది తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
మిజోరాంలో పోలింగ్ ముగియగా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వల్ల హెలీకాఫ్టర్లకు డిమాండ్ బాగా పెరిగింది. వివిధ పార్టీల జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు సైతం ప్రైవేట్ హెలికాప్టర్లలో పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో హెలికాప్టర్ల తాకిడి మరింత ఎక్కువైంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అగ్ర నాయకులు ప్రైవేట్ హెలికాప్టర్లను వాడుతున్నారు.
హెలికాప్టర్ మోడల్, వాటిలోని సౌకర్యాలు, డిమాండ్ ను బట్టి గంటకు రూ. లక్షన్నర నుంచి రూ. 5 లక్షల రూపాయల వరకు చార్జ్ చేస్తున్నాయి ట్రావెల్ ఏజెన్సీలు. సింగిల్ ఇంజన్ హెలికాప్టర్ ఛార్జ్ గంటకు లక్షా 50 వేల రూపాయలు ఉండగా డబల్ ఇంజిన్ హెలికాప్టర్లకు గంటకు 2 లక్షల 75 వేల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారని చెబుతున్నారు. అయితే ట్రావెల్ చేసే వ్యక్తుల సంఖ్యను బట్టి రేట్ మారుతూ ఉంటుంది.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే చాలామంది నేతలు హెలికాప్టర్లను బుక్ చేసుకున్నారు. ప్రయాణించే వ్యక్తిని బట్టి ట్రావెల్ ఏజెన్సీస్ హెలికాప్టర్ మోడల్ ను ఖరారు చేస్తాయి.విఐపి, వీవీఐపిల కోసం ప్రత్యేక భద్రతతో పాటు, వారికి కావాల్సిన లగ్జరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ వినియోగించిన హెలికాప్టర్ ఇటీవల రెండుసార్లు మొరాయించిన విషయం తెలిసిందే. దీంతో హెలికాఫ్టర్లలో భద్రతా ఏర్పాట్లపై మరింత శ్రద్ధ చూపుతున్నామని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నవంబర్ 28 వరకు వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు. దీంతో ఆయన కోసం ప్రైవేట్ హెలికాప్టర్‌ను బుక్ చేశారు. దాదాపు 70 నియోజకవర్గాలలో ఆయన హెలికాప్టర్ లో తిరగనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణ ఇప్పటి వరకు హెలికాప్టర్లను వినియోగించారు. ముందుముందు మరింతమంది నాయకులు హెలికాప్టర్లను వినియోగించే అవకాశం ఉంది. దీంతో ఆయా పార్టీలపై భారం పడనుంది.
Discussion about this post