ఏపీ బీజేపీలో విబేధాలు బయటపడ్డాయి. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పనితీరును పలువురు నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ కోసం కాకుండా టీడీపీ కోసం పనిచేస్తున్నారంటూ ఘాటు విమర్శలు సంధిస్తున్నారు.. కమలం పార్టీలో ఉన్న టీడీపీ కోవర్టు అంటూ ఆరోపిస్తున్నారు. ఆవిడ్ని హటావో.. పార్టీ బచావో అంటూ కొత్త పాట మొదలుపెట్టారు.
రాష్ట్రంలో ఎంతో మంది బీజేపీ అధ్యక్షులతో కలిసి పనిచేశామని పురందేశ్వరి లాంటి అధ్యక్షులను చూడలేదని మండిపడుతున్నారు. పురందేశ్వరి బీజేపీ కోసం పనిచేస్తున్నారో లేక టీడీపీ జెండాను మోస్తున్నారో బీజేపీ శ్రేణులకు అర్థం కావడం లేదంటున్నారు . రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి పార్టీ బలోపేతం కోసం కాకుండా ఆమె సొంత ప్రయోజనాల కోసం బీజేపీని భ్రష్టు పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరారు తప్పితే నిజంగా ఆమెకు పార్టీపై ఎలాంటి ప్రేమ లేదని బీజేపీని త్వరలోనే టీడీపీకి తాకట్టు పెట్టే అవకాశాలు లేకపోలేదనే ఆరోపణలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఏ పార్టీ పదవి ఇస్తుందని తెలిస్తే ఆ పార్టీలోకి పురందేశ్వరి జంప్ అయిపోతుందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక పార్టీ కోసం పనిచేయడం మానేసి టీడీపీని కాపాడుకునే బాధ్యతను తన భుజంపై వేసుకున్నారా అంటూ పార్టీలో కొంతమంది ఆరోపిస్తున్నారు. అవినీతి ఆరోపణలపై చంద్రబాబు అరెస్టయితే టీడీపీ కార్యకర్తలకంటే ముందు ఆమె ఖండించిన సంఘటన దీనికి ఉదాహరణగా వక్కాణిస్తున్నారు.
అవినీతి ఆరోపణలతో అరెస్టు అయిన చంద్రబాబును పురందేశ్వరి వెనుకేసుకురావటం ఎంత వరకు సమంజసమని.. టీడీపీ బలహీనపడుతున్న సమయంలో బీజేపీని ఏ రకంగా బలోపేతం చేయాలో ఆలోచన చేయడం మానేసి పురందేశ్వరి టీడీపీని ఎలా కాపాడుకోవాలో, అందుకోసం బీజేపీని ఎలా వాడుకోవాలో అని ప్రణాళికలు రచిస్తున్నారంటున్నారు, ఏపీలో ఇసుక స్కాం మద్యం స్కాం లాంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చి కాసేపు హడావుడి చేసి తర్వాత సైలెంట్ అయిపోవడాన్ని పార్టీ కార్యకర్తల్లో అయోమయం నింపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఇసుక స్కామ్‌లో హడావుడి చేసి తర్వాత సైలైంట్ అవడంతో ఏమైనా ఆర్థిక ప్రయోజనాలు పొందారా అన్న సందేహాలను కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.
మద్యం స్కాము అంటూ ఆరోపణలు చేసిన పురందేశ్వరి ఆ తర్వాత ఆ అంశాన్ని ఎందుకు గాలికొదిలేశారని బీజేపీలో కొందరు చర్చించుకుంటున్నారు. అదే సమయంలో మద్యం కంపెనీలతో పురందేశ్వరి కుటుంబ సభ్యులు బేరాలాడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులు చెబుతున్నారు. ఏపీలో స్కాములు జరిగి ఉంటే వాటికి సంబంధించిన ఆధారాలను పురందేశ్వరి పార్టీలోని ఇతర నాయకులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఇక జిల్లాల్లో కూడా బీజేపీ పోస్టులను అధ్యక్షురాలి హోదాలో అమ్ముకున్నట్లు వార్తలొస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 30శాతం పోస్టులు పురందేశ్వరి సామాజిక వర్గానికి చెందిన వారికే కట్టబెట్టడంతో బీజేపీ క్యాడర్‌లో ఒక్కింత అసంతృప్తి కనిపిస్తోంది. గత 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఆమె సొంత సామాజిక వర్గంవారిని కూడా పక్కనబెట్టి కొత్తవారిని తెరపైకి తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటని పలువురు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇందులో చాలామంది టీడీపీ నుంచి వచ్చినవారే కావడం విశేషం
బీజేపీలో మునుపెన్నడూ కుల ప్రస్తావన లేదని పురందేశ్వరి రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టాకే ఇవన్నీ తెరపైకి వచ్చాయని..దీంతో పార్టీకి నష్టం కలుగుతోందని పలువురు సీనియర్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు పురందేశ్వరి పదవే పరమావధిగా భావిస్తారని అందువల్లే అన్ని పార్టీలు మారారని బీజేపీ నేతలు చెబుతున్నారు. పదవులు కూడా దొడ్డిదారినే తెచ్చుకున్నారని గుర్తు చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి పార్టీకి డ్యామేజ్ కలిగేలా వ్యవహరిస్తుండటంతో రాష్ట్రంలోని ఇతర నాయకులంతా కలిసి ఢిల్లీలోని హైకమాండ్‌కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం కార్యాచరణ రూపొందిస్తున్నారు.
Discussion about this post