ఆస్కార్ అవార్డు.. సినీ రంగంలోని ప్రతిభావంతులకు ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక ఆవార్డు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న ఈ అవార్డు ప్రత్యేకత గురించి మీకు తెలుసా? ఇంతకీ ఆస్కార్ అంటే ఏంటి? ఈ అవార్డు ఎలా తయారు చేస్తారు? ఎవరెవరికి.. ఏయే రంగాల వారికి ప్రదానం చేస్తారో తెలుసుకుందాం.
ఆస్కార్ అవార్డును మొదట్లో అకాడమి అవార్డు అని పిలిచేవారు. దీని పూర్తి పేరు ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’. ఆ తర్వాత దీనికి ఆస్కార్ అనే పేరు పెట్టారు. ఆ పేరు ఎలా వచ్చిందనేది కచ్చితమైన సమాచారం లేదు. కానీ దీని వెనుక ఓ ఊహాగానం ఉంది. అదేంటంటే ఈ అకాడమీ అవార్డులను ఇచ్చే సంస్థకు మార్గరెట్ హెరిక్ అనే మహిళ సేవలందించారట. విజేతలకు అందించే ఈ అవార్డు ప్రతిమను చూసి ఆమె.. ‘దీని ఆకృతి మా అంకుల్ ఆస్కార్‌లా ఉంది’ అని చెప్పిందట. దీంతో అలా ‘ఆస్కార్ అవార్డు’ పేరు వచ్చింది. 1939లో ఇదే పేరును అధికారికంగా కూడా స్వీకరించారు.
ఆస్కార్ అవార్డును చూడటానికి బంగారంలా మెరిసిపోతుంది. దీంతో అంతా ఈ అవార్డును బంగారంతో చేస్తారని భావిస్తారు. నిజానికి ఆస్కార్ ప్రతిమలో ఉండేదంతా బంగారం కాదు. దీనిని కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ బంగారంతో పూత పూస్తారు. ఇక ఈ ప్రతిమను పదమూడున్నర అంగుళాల ఎత్తు అంటే 35 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఎత్తు ఉంటుంది. బరువు మాత్రం దాదాపు నాలుగు కేజీలు ఉంటుంది. దీనికి ఐదు స్పోక్స్ ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే ఐదు ప్రధాన విభాగాలను అంటే నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, రచయితలను ఇవి సూచిస్తాయి.
ఈ అవార్డు సృష్టికర్త ఎంజీఎం స్టూడియో ఆర్డ్ డైరెక్టర్ కెడ్రిక్ గిబ్బన్స్. ఆయన ఆస్కార్ ప్రతిమను తయారు చేసే సమయంలో డిజైన్ కోసం నటుడు ఎమిలో ఫెర్నాండెజ్‌ను నగ్నంగా నిలబెట్టి ఈ అవార్డు ప్రతిమను సృష్టించారు. అలా ఆ నటుడు రూపంలో కెడ్రిక్ గిబ్బన్స్ ఆస్కార్ ప్రతిమను డిజైన్ చేశారు. అందుకే ఆస్కార్ ప్రతిమ నగ్నంగా ఉంటుంది. ఇక అవార్డు తయారీకి చాలా సమయం పడుతుంది. 50 ఆస్కార్ ప్రతిమలు తయారుచేయాలంటే సాధారణంగా మూడు నెలలు పడుతుంది. మొట్ట మొదటి ఆస్కార్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం 1929లో మే 16న హాలీవుడ్ లోని హోటల్ రూజ్వెల్ట్లో జరిగింది. చలన చిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించడం కోసం నటుడు డగ్లస్ ఫెయిర్ బ్యాంక్స్, విలియం డెమిలీ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Discussion about this post