ఓట్ ఫ్రమ్ హోమ్ ఈ సారి ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ కొత్తగా కల్పించిన సౌకర్యం.. 80 ఏళ్లు దాటిన వృద్ధులు.. 40 శాతానికి పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులు ఇంటి వద్దే ఓటు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం.. మరి.. ఓట్ ఫ్రమ్ హోమ్‌కి ఏం చేయాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి? ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. సజావుగా.. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు తగిన చర్యలు తీసుకుంటున్న ఈసీ… దివ్యాంగులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. పోలింగ్ బూత్ వరకు వచ్చి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ఓటు వేసేలా ఏర్పాట్లు చేస్తోంది ఎన్నికల సంఘం… రాష్ట్రంలో తొలిసారిగా అమలు చేస్తోన్న ఈ విధానంపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. 80 ఏళ్లు దాటిన వృద్ధులు, 40 శాతం కన్నా ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు మాత్రమే ఇంటి వద్ద ఓటు వేయటానికి అర్హులు. ఓటర్ల జాబితా ప్రకారం ఎవరెవరు ఓటు ఫ్రమ్ హోమ్‌కు అర్హులో ఇప్పటికే గుర్తించింది ఈసీ.. రాష్ట్రంలో 80 ఏళ్లు దాటిన వృద్ధ ఓటర్లు నాలుగున్నర లక్షల మంది ఉండగా, వీరిలో శతాధిక వృద్ధులే ఏడు వేల మంది. ఇక 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు 5 లక్షల మంది ఉన్నారని చెబుతోంది ఈసీ.
అయితే ఇంటి నుంచే ఓటు వేసే వెసులుబాటును ఉపయోగించుకోవాలనుకునే వృద్ధులు, దివ్యాంగులు ముందుగా ఫారం 12డీ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి ఐదు రోజుల పాటు ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు. అంటే నవంబర్ 3 నుంచి 8వ తేదీవరకు ఓట్ ఫ్రమ్ హోమ్ కోసం దరఖాస్తులు చేసుకోవాల్సివుంటుంది. పూర్తిచేసిన ఫార్మ్ 12డి దరఖాస్తులు నిర్దేశించిన గడువులోగా సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు అందజేయాల్సివుంటుంది. ఓటర్ లిస్ట్‌లో తమ పేరు ఏ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉంది.. సీరియల్ నంబర్ వంటి వివరాలు ఇవ్వాలి. వృద్ధులైతే తమ వయసు, వికలాంగులైతే పర్సన్ విత్ డిజెబిలిటీ అనేది టిక్ చేయాలి.
దరఖాస్తులను పరిశీలించిన తరువాత అర్హతను బట్టి ఇంటి నుంచే ఓటు వేసే సదుపాయం కల్పించాలా వద్దా అనేది అధికారులు నిర్ణయిస్తారు. అర్హత ఉన్న వారి ఇంటికి అధికారులే వెళ్లి ఓటు వేయిస్తారు. ఇంటి వద్ద ఓటు తీసుకున్నా.. ఎవరికి ఓటు వేస్తున్నారనేది రహస్యంగా ఉంచేందుకు పోలింగ్ బూత్‌లో చేసే ఏర్పాట్లే ఇళ్ల వద్ద చేయనున్నారు.
Discussion about this post