ప్రస్తుతం అడ్డూ అదుపూ లేకుండా పెరుగుతున్న ఉల్లి ధరలు త్వరలో ఎన్నికలు జరగనున్న అయిదు రాష్ట్రాలలో బీజేపీ కొంప ముంచనున్నాయా.. అనే ప్రశ్న చర్చనీయాంశంగా మారింది. 1998 అసెంబ్లీ ఎన్నికలలో ఉల్లి ధరలు బీజేపీ కొంప ముంచిన విషయాన్ని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఉల్లి ధరల పెరుగుదల అస్త్రాన్ని కాంగ్రెస్ ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీపై సంధించింది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలు ప్రధాని నరేంద్ర మోడీకి గుణపాఠం చెప్పనున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హెచ్చరించారు.
వర్షాలు సరిగా లేక ఉల్లి ఉత్పత్తి తగ్గటం, వర్షాల లేమి వల్ల రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేయటం వల్ల ఒక్క సారిగా ఉల్లి ధరలు మండి పోతున్నాయి. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ఎగుమతులకు అనుమతి ఇవ్వటం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతోంది. నిన్న మొన్నటి వరకు మార్కెట్ లో 30 రూపాయలకు మించని కిలో ఉల్లి ధర ప్రస్తుతం 70.., 80 రూపాయలకు చేరింది. హోల్ సేల్ మార్కెట్ కు దూరంగా ఉన్న ప్రాంతాలలో 100 రూపాయలకు కూడా విక్రయిస్తున్నారు. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్ లోనే కిలో ఉల్లి ధర 60 నుంచి 65 రూపాయలు ఉంటోందని చెబుతున్నారు.
1998 లో తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగ్గా ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ ఘోరంగా దెబ్బ తిని ఓటమి పాలయింది. ఈ నాలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఉల్లి ధరలే కావటం విశేషం. ఫలితంగా అప్పటి ప్రధాని వాజపేయి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది.
ఇప్పుడు కూడా అదే పరిస్థితి తప్పదని కాంగ్రెస్ తో పాటు బీజేపీయేతర పార్టీల నాయకులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉల్లి ధరల అస్త్రాన్ని పకడ్బందీగా ఉపయోగించుకోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, వామపక్షాల నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరి ఇదెంతవరకు ఫలిస్తుందో .. వేచి చూడాలి.
Discussion about this post