తెలంగాణ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జనసేన మాత్రం బాగా వెనుకబడింది. ఆపార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించడం లేదు. పార్టీ తరపున పవన్ ఎక్కడా బహిరంగ సభలు నిర్వహించిన జాడ లేదు .పవన్‌తో పొత్తు పెట్టుకున్న బీజేపీనే కాదు…..జనసేన కేడర్ కూడా ఇదే ప్రశ్న అడుగుతోంది.
తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ-జనసేన పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించింది బీజేపీ. కూకట్పల్లి, తాండూరు, కోదాడ, ఖమ్మం, నాగర్‌కర్నూలు, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట స్థానాలను జనసేనకు కేటాయించింది బీజేపీ. పవన్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీతో సభలో పాల్గొనడం తప్పితే.. జనసేనకు కేటాయించిన సీట్లలో ఇప్పటిదాకా ప్రచారానికి వెళ్లలేదు పవన్ కల్యాణ్. అటు మిత్రపక్షం బీజేపీ తరఫున కూడా ఆయన క్యాంపెయిన్ చెయ్యడం లేదు. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల ప్రచారానికి ఫుల్స్టాప్ కూడా పడనుంది. అయితే పవన్ అసలు ప్రచారానికి వెళతారా లేదా అనేదానిపై సస్పెన్స్ నెలకొంది.
జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. 32 సీట్లకు తాము పోటీ చేయబోతున్నట్లు మొదట ప్రకటించినా.. బీజేపీతో చర్చల తరువాత 8 మంది అభ్యర్ధులను అనౌన్స్ చేశారు పవన్ కల్యాణ్. అంటే పోటీ చేసే స్థానాలను నాలుగో వంతుకు కుదించుకున్నారు. టికెట్ల వారీగా చూస్తే.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాలుగు కీలక నియోజకవర్గాలు జనసేనకు దక్కాయి.
టికెట్లు ఎవరికి దక్కాయన్నది పక్కనపెడితే… కనీసం ఒకట్రెండు స్థానాల్లో అయినా జనసేన గెలవాల్సి ఉంటుంది. కూకట్పల్లి, ఖమ్మం వంటి కీలక స్థానాలను దక్కించుకోవడమే ఇందుకు కారణం. జనసేనతో పెట్టుకుని నష్టపోయామని బీజేపీ అనుకోకుండా ఉండాలంటే పవన్ సత్తా చాటాల్సిందే. పైగా ఈ ప్రభావం ఏపీ జనసేన పైనా పడుతుంది.
మరి ఇలాంటి కీలక సమయంలో పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారో .. ఎవరికి అర్ధం కాని విషయం. ఆయన మౌనం పై పలు ఊహాగానాలు ప్రచారం లో ఉన్నాయి. ఏపీ లో టీడీపీ తో పొత్తులో ఉండి ఇక్కడ బీజేపీ తో కలసి పనిచేస్తే చంద్రబాబు కి కోపం వస్తుందనే సందేహంతో పవన్ ప్రచారం చేయడం లేదని అనుకుంటున్నారు. ఇక్కడ పోటీ చేసినా టీడీపీ ఓట్లు జనసేనకు పడే సూచనలు లేవు. అది కూడా ఒక కారణం అని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికి పవన్ ఎందుకో డైలమాలో పడ్డారు. కారణం ఏమిటో అర్ధంకాక జనసైనికులు గందరగోళం లో పడ్డారు.
Discussion about this post