అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీకు ఇబ్బందులు ఎదురౌతున్నాయి. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా రాష్ట్ర ముఖ్యమంత్రి గెహ్లాట్ కుమారుడి ఇంట్లో ఈడీ సోదాలు చేయడమే కాకుండా కుమారుడు వైభవ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామం ఇప్పుడు ఆ పార్టీని ఇరుకునపెడుతోంది.
ఇప్పటికే రాజస్థాన్‌లో పరీక్ష పేపర్ లీక్ కేసులో భాగంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దొత్సరా, మరో కాంగ్రెస్ అభ్యర్ధి నివాసాల్లో, కార్యాలయాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఇదే కేసులో మనీ లాండరింగ్ అభియోగాలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ క్రమం లోనే ఫెరా నిబంధనల ఉల్లంఘన జరిగిందంటూ అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 27వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించింది .
రాజస్థాన్‌లోని 200 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 25న ఎన్నికలు జరగనున్నాయి. వైభవ్ గెహ్లాట్ ప్రస్తుతం ఏఐసీసీ సభ్యుడిగానే కాకుండా రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే మహిళలకు ఏటా 10 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందిస్తామని ప్రకటించిన మరుసటి రోజే ఈడీ సమన్లు జారీ అయ్యాయి.
ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే తమను ఇరుకునపెట్టేందుకు బీజేపీ దాడులు చేయిస్తోందని వైభవ్ గెహ్లాట్ మండిపడ్డారు. ఎన్నికల సమయం కావడంతోనే ఇలా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కేంద్ర ప్రభుత్వంపై రాజస్థాన్ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు.
Discussion about this post