తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతేదీ దగ్గరపడేకొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వలసలు కూడా జోరందుకుంటున్నాయి. కొన్నాళ్ల క్రితం బీజేపీ లో చేరి … మునుగోడు ఉప ఎన్నికల లో పరాజయం పాలైన కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి మళ్ళీ కాంగ్రెస్లో చేరబోతున్నారు. బీజేపీ కి రాజీనామా కూడా చేసారు. రాజీనామా చేయకముందు మునుగోడు సీటును తన భార్య లక్ష్మికి, ఎల్.బి.నగర్ స్థానాన్నితనకు ఇవ్వాలని రాజగోపాల రెడ్డి బీజేపీ అధిష్టానాన్నిఅడిగారు. అయితే బీజేపీ ససేమిరా అన్నట్టు సమాచారం. మునుగోడు లో గెలుపు పై సందేహం తోనే ఎల్బీ నగర్ సీటు అడిగినట్లు చెబుతున్నారు. రెండు సీట్లు ఇవ్వకపోతే మళ్ళీ ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని ముందునుంచే ప్రచారం జరిగింది.చివరికి అలాగే జరిగింది.
2018 ఎన్నికల్లో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి గా గెలిచి గత ఏడాది పార్టీకి ..శాసన సభ్యత్వానికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన అయన టిఆర్ఎస్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి 97,006 ఓట్లు రాగా .. రాజగోపాలరెడ్డికి 86,697 ఓట్లు వచ్చాయి. దీంతో ప్రభాకర రెడ్డి 10,309 ఓట్ల మెజారిటీతో గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు వచ్చాయి.
ఉపఎన్నికలలో ఓటమి పాలయిన నేపథ్యంలో మరోసారి మునుగోడు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి రాజగోపాలరెడ్డి సుముఖంగా లేరు. అందుకే సేఫ్ సైడ్ గా ఎల్.బి. నగర్ సీటు తనకు ఇవ్వాలని అడుగుతున్నారు. అలాగే సొంత ప్రాంతమైన మునుగోడును వదులుకోవటం ఇష్టం లేక ఆ స్థానాన్ని తన భార్య లక్ష్మికి కేటాయించాలని కోరుతున్నారు. అదే డిమాండ్ ను కాంగ్రెస్ అధిస్థానం ముందు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి సోదరుడు వెంకటరెడ్డి కి నల్గొండ సీటు ఇచ్చారు. మరి రాజగోపాలరెడ్డి అడిగినట్టు ఎల్బీనగర్ టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది సస్పెన్స్. ఇక మునుగోడుసీటును కాంగ్రెస్ మిత్రపక్షమైన సిపీఐ అడుగుతోంది. ఒక వేళ తమకు వదిలి పెట్టకపొతే స్నేహపూర్వక పోటీ తప్పదని చెబుతోంది. ఎల్బీనగర్ సీటు ను మధు యాష్కీ కూడా అడుగుతున్నారు దీంతో అధిష్ఠానం కు ఎల్బీనగర్ సీటు పెద్ద సమస్యగా మారనుంది.
కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి కోరుకుంటున్న ఎల్.బి.నగర్ స్థానం నుంచి గత ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి డి.సుధీర్ రెడ్డి విజయం సాధించారు. ఆయనకు 1,07,242 ఓట్లు రాగా టిఆర్ఎస్ అభ్యర్థి టి.రామ్మోహన్ గౌడ్ కు 1,05,303 ఓట్లు పడ్డాయి. దీంతో సుధీర్ రెడ్డి 1939 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శేఖర్ రావు పేరాలకు 21,563 ఓట్లు వచ్చాయి. ఎప్పటినుంచో సుధీర్ కూడా పార్టీ లో ఉన్నారు. ఈ సారి సీటు ఎవరికి ఇస్తారో చూడాలి.
Discussion about this post