ఏపీలోని విజయనగరం జిల్లా కంటకాపల్లి – అలమండ స్టేషన్ల మధ్య ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొనడంతో 14 మంది మరణించారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ దీపికా పాటిల్, రైల్వే ఉన్నతాధికారులు సంఘటన స్థలికి చేరుకొని సహాయ చర్యలను పర్యవేక్షించారు.
ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద ఈ ఏడాది జూన్ లో జరిగిన ఘోర రైలు ప్రమాద విషాదాన్ని మరువక ముందే ఏపీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్ వద్ద మూడు రైళ్లు ఢీకొని 300 మందికి పైగా మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే. ఒడిశాలో జరిగిన ప్రమాదానికి సిగ్నలింగ్ సమస్య, మానవ తప్పిదం కారణాలు కాగా విజయనగరం జిల్లాలో జరిగిన ప్రమాదానికి సిగ్నలింగ్ సమస్యతో పాటు ఓహెచ్‌ఆర్ కేబుల్‌లో సమస్య, మానవ తప్పిదం కారణాలుగా తెలుస్తోంది.
పలాస ప్యాసింజర్ రైలు ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరింది. విజయనగరం జిల్లా కొత్తవలస దాటిన తర్వాత ఓహెచ్‌ఆర్ కేబుల్‌లో సమస్య తలెత్తడంతో… అలమండ మిడిల్ లైన్లో ఆగిపోయింది. అరగంట వరకు రైలు అక్కడి నుంచి కదల్లేదు. మరోవైపు… విశాఖపట్నం నుంచి సాయంత్రం 6 గంటలకు రాయగడ ప్యాసింజర్ విశాఖ నుంచి బయలుదేరింది. కేబుల్ సమస్యతో అదే పట్టాలపై మరో రైలు ఆగి ఉందన్న సమాచారం వెనుక వస్తున్న రైళ్లకు అందాలి. అవన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవాలి. లోపం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, విశాఖ-రాయగడ ప్యాసింజర్ రైలు అదే లైన్లో వేగంగా వచ్చింది. పలాస ప్యాసింజర్‌ను వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో పలాస పాసింజర్ ట్రైన్ గార్డుతో పాటు రాయగడ పాసింజర్ రైలు లోకో పైలట్లు మృతి చెందారు. వీరితో కలిపి రెండు రైళ్లలో ప్రయాణిస్తున్న 14 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో రెండు రైళ్లలో దాదాపు 1400 మంది ఉన్నారని తెలుస్తోంది. క్షతగాత్రులను విజయనగరం కేంద్రాసుపత్రి, విశాఖపట్నం కేజీహెచ్‌లకు తరలించారు.
ప్రమాదంలో మరణించిన ఏపీ వారికి పది లక్షలు, తీవ్రంగా గాయపడినవారికి రెండు లక్షల పరిహారాన్ని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాల మృతులకు రెండు లక్షలు, గాయ పడిన వారికి 50 వేలు ఇవ్వనున్నట్టు తెలిపింది. పరిహారాన్ని వెంటనే అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో సీఎం జగన్ మాట్లాడారు. ప్రమాద కారణంగా రైల్వే అధికారులు పలు రైళ్లను రద్దు చేసారు. కొన్ని రైళ్లను దారి మళ్లించగా మరికొన్నింటిని రీషెడ్యూల్ చేసారు.
Discussion about this post