తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో ఇన్కమ్ టాక్స్ అధికారుల సోదాలు పెద్ద ఎత్తున జరుగుతుండటం కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్న భయంతోనే ఈ దాడులు చేయిస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మరో వైపు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటినుంచి ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు జరిపిన దాడులలో స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు దాటింది. ఇందులో నగదు 145 కోట్లకు పైగా ఉంది.
హైదరాబాద్‌లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నేతల ఇళ్లే టార్గెట్‌గా ఈ సోదాలు జరగుతున్నాయి. అలాగే క్రిస్టియన్ మిషనరీలతో పాటు వివిధ సంస్థల్లో అధికారులు సోదాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 40 చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నాయి. అల్వాల్, పటాన్ చెరువు, కీసర, జీడిమెట్ల, బొల్లారం, సికింద్రాబాద్, మెదక్, వరంగల్ సహా పలు ప్రాంతాల్లో ఈ సోదాలు చేపట్టారు. గురువారం ఈ సోదాలు ప్రారంభం కాగా శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నివాసంలో జరిగాయి. జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీసారు. ఎన్నికల్లో రఘువీర్ నాగార్జున సాగర్ నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక గురువారం మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, బండంగ్‌పేట మేయర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి చిగురింత పారిజాత నర్సింహా రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష్మారెడ్డి ఇళ్లు, విల్లా, ఫామ్‌హౌసుల్లో కూడా సోదాలు జరిగాయి. బాలాపూర్ గణపతి లడ్డూను వేలంలో కొనుగోలు చేసిన వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా తనిఖీలు చేశారు.
కోకాపేటలోని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు, రియల్ ఎస్టేల్ వ్యాపారి గిరిధర్‌రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేపట్టారు. ఈ సోదాలలో కొద్దిపాటి నగదు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. మహేశ్వరం టికెట్ కోసం భారీ ఎత్తున లాబీయింగ్ జరగడంతో లక్ష్మారెడ్డి, పారిజాతల ఆర్థిక లావాదేవీలపై ఐటీ అధికారులు నిఘా పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
ఐడీ దాడులపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి భయభ్రాంతులను గురిచేస్తున్నారని మండిపడ్డారు. మహేశ్వరంలో సబితారెడ్డి ఓడిపోతున్నారని భయపడిన సీఎం కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వం, పీయూష్ గోయల్ సహకారంతో ఐటీ సోదాలు చేయించారని ఆరోపించారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇల్లు, కార్యాలయాలు, తన బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని లక్ష్మారెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్రపన్ని ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగా, మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోద్బలంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.
కాంగ్రెస్ నేతల ఆరోపణల నేపథ్యంలో .. సోదాలు ముగిసాక ఐటీ అధికారులు ఏమిటి చెబుతారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినప్పటినుంచి ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు జరిపిన దాడులలో స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ 400 కోట్ల రూపాయలు దాటింది. ఇందులో నగదు 145.32 కోట్లు ఉండగా 230 కిలోలకు పైగా బంగారం, 1038.9 కిలోల వెండి, 20 కోట్లకు పైగా విలువైన మద్యం, 17 కోట్లకు పైగా విలువైన గంజాయి, 30 కోట్లకు పైగా విలువైన ఇతర వస్తువులు, బహుమతులు ఉన్నాయి
Discussion about this post