ఒక పార్టీ.. ముగ్గురు నేతలు.. ఎవరి దారి వారిదే.. ముగ్గురూ మూడు వైపుల నుంచి పాదయాత్రలు చేస్తూ క్యాడర్‌ను గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఈ ఆధిపత్య పోరేంటో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు కార్యకర్తలు. టికెట్ ఎవరికి దక్కుతుందోకాని.. మిగిలిన రెండు వర్గాలను కలుపుకుని వెళ్లడం ఆ నియోజకవర్గంలో కత్తిమీద సామే కాబోతోంది.. టిక్కెట్ ఆశించే వారు ఎక్కువగా ఉంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది మరి.
కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి దుబ్బాక కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. ముగ్గురు నేతల మధ్య ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరింది. అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ముగ్గురు నేతలు తగ్గేదేలే అన్నట్లు పంతానికి పోతున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారాయి. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ గ్రూప్ రాజకీయాల వల్లే ఓడిపోతున్నామంటున్నారు కార్యకర్తలు. దుబ్బాకలో బీఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీల మధ్యే పోటాపోటీ ఉండేది. కానీ స్థానిక నేతల్లో ఆధిపత్య పోరు వల్ల రెండేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో మూడోస్థానానికి పడిపోయింది కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్. ప్రస్తుతం పార్టీలో మూడు గ్రూపులు.. ఆరు వర్గాలుగా మారింది పరిస్థితి. మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డిది ఒక వర్గం కాగా… గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన శ్రావణ్‌కుమార్‌రెడ్డి మరో వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రెండు గ్రూపుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది. పార్టీకి ఈ రెండు వర్గాలతోనే సమస్య అనుకుంటుండగా… తాజాగా కత్తి కార్తీక రూపంలో మరో వర్గం మొదలైంది. దీంతో దుబ్బాక కాంగ్రెస్ మూడు ముక్కలాటగా మారిపోయింది.
చెరుకు శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి, కత్తి కార్తీక.. ఈ ముగ్గురూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డిల మధ్య అస్సలు పొసగడం లేదు. శ్రావణ్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్ కోవర్టు అంటూ బహిరంగ విమర్శలు చేస్తుంటారు శ్రీనివాస్‌రెడ్డి. అంతేకాదు శ్రావణ్‌కుమార్‌రెడ్డి ఎప్పుడూ మంత్రి హరీశ్‌రావు ఇంట్లో ఉంటారని ఆరోపిస్తున్నారు శ్రీనివాస్‌రెడ్డి… ఆయన విమర్శలను శ్రావణ్‌కుమార్ వర్గం తిప్పికొడుతోంది. ఈ రెండు వర్గాల మధ్య సయోధ్య కుదర్చాల్సిన కాంగ్రెస్ పెద్దలు కూడా చెరోవర్గానికి కొమ్ముకాస్తుండటంతో రోజురోజుకు పరిస్థితి దిగజారుతోందంటున్నారు కార్యకర్తలు… ఇక వీరిద్దరితో సంబంధం లేకుండా కత్తి కార్తీక తన ప్రయత్నాలేవో తాను చేసుకుంటూ వెళుతున్నారు.
తొలి జాబితాలో దుబ్బాక కాంగ్రెస్ టికెట్ ప్రకటిస్తే ఈ గ్రూపు వార్‌కు ఫుల్స్టాప్ పడే అవకాశం ఉండేది. కానీ, ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేక పెండింగ్‌లో పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. దీంతో ఈ ముగ్గురూ ప్రజల్లో తమకే బలం ఉందని నిరూపించుకునేందుకు పాదయాత్రలు మొదలుపెట్టారు. ఒకేసారి ముగ్గురు నేతలు గ్రామాల బాట పట్టడంతో ఎవరి వెంట నడవాలో తేల్చుకోలేక సతమతమవుతున్నారు కార్యకర్తలు. అధిష్టానం జోక్యం చేసుకుని ఒకే కార్యక్రమం నిర్వహించేలా ముగ్గురి మధ్య సమన్వయం చేయాల్సివుండగా.. ఆ పని చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. ముగ్గురూ మూడువైపుల లాగితే పార్టీ గెలవడం కష్టమనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం దుబ్బాకకు బీజేపీ నేత రఘునందన్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020 లో జరిగిన ఉపఎన్నికలో రఘునందన రావు బీజేపీ తరపున పోటీ చేసి 1079 ఓట్ల మెజారితో గెలుపొందారు. 2018 నాటి ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి 62,500 ఓట్ల మెజారితో గెలుపొందారు. నాడు కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మద్దుల నాగేశ్వరరెడ్డికి 26,799ఓట్లు రాగా బీజీపీ తరపున బరిలోకి దిగిన రఘునందన్ రావు కి 22,595ఓట్లు మాత్రమే వచ్చాయి. సోలిపేట రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో 2020 లో ఉపఎన్నిక జరిగింది. ఈ ఎన్నికలో అనూహ్యంగా రఘునందన్ రావు దూసుకుపోయారు. సోలిపేట రామచంద్రారెడ్డి సతీమణి సుజాతా రెడ్డి బరిలోకి దిగినప్పటికీ సానుభూతి ప్రభావం కనబడలేదు. కాంగ్రెస్ అభ్యర్థి చెరకు శ్రీనివాసరెడ్డి 21,819 ఓట్లు తెచ్చుకుని మూడో స్థానానికి పరిమితమయ్యారు . ఈ సారి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి .
Discussion about this post