భారత దేశ చరిత్రలో మరచిపోలేని, మరవకూడని పారిశ్రామిక వేత్తలు, సెలెబ్రిటీలు చాలామంది ఉన్నారు. వారి జీవితం, సక్సెస్ ఇనిస్పిరేషన్ గా నిలిస్తే.. వారి పతనం ఓ గుణపాఠంగా మిగులుతుంది. ఇలాంటి వారిలో సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ ఒకరు. నవంబర్ 14 న రాత్రి ముంబైలో ఆయన కన్నుమూసారు. ఆయన స్థాపించిన సహారా గ్రూప్ లక్షలాది మంది జీవితాల్లో వెలుగులు నింపింది. అంతకంటే ఎక్కువ మందిని కష్టాల పాలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించడం, పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి ఇవ్వలేదనే ఆరోపణలతో ఆయన జైలుపాలైన సంగతి తెలిసిందే.
1948, జూన్ 10వ తేదీన బిహార్ లోని అరారియాలో సుబ్రతా రాయ్ జన్మించారు. మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్న చిట్‌ఫండ్ సంస్థ సహారా ఫైనాన్స్‌ను 1976లో కొనుగోలు చేశారు. 1978 నాటికి దానిని సహారా ఇండియా పరివార్‌గా తీర్చిదిద్దారు. తర్వాత హౌసింగ్, ఎంటర్టైన్మెంట్, మీడియా, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాలకు వ్యాపారాన్ని విస్తరించారు. 2000 నాటికి సహరా ఇండియా పరివార్ లో 12 లక్షల మంది పని చేసేవారు. రైల్వేల తర్వాత అత్యధిక ఉద్యోగులు ఉన్న సంస్థగా సహారా గ్రూప్ గుర్తింపు తెచ్చుకుంది.
జీవితంలో ఎన్నో సవాళ్లను సుబ్రతా రాయ్ ఎదుర్కొన్నారు. మూడు కోట్ల మందికి పైగా పెట్టుబడిదారుల నుండి రూ. 24,000 కోట్లకు పైగా సొమ్మును చట్టవిరుద్ధంగా సమీకరించినట్టు సెబీ గుర్తించింది. దీనిని తిరిగి చెల్లించమని సహారా సంస్థలను కోరింది. చివరికి కేసు సుప్రీం కోర్టుకు చేరింది. సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం సొమ్ము డిపాజిట్ చేయడంలో విఫలమవటంతో సుబ్రతా రాయ్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. చాలా ఏళ్లపాటు తీహార్ జైలులో ఉన్న ఆయన తర్వాత పెరోల్ పై బయటకు వచ్చారు. పెరోల్ పై ఉండగానే అనారోగ్యం పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
సుబ్రతా రాయ్‌కు భార్య స్వప్నా రాయ్, ఇద్దరు కుమారులు సీమాంతో, సుశాంతో రాయ్ ఉన్నారు. సెబీ కేసు నేపథ్యంలో సుబ్రతారాయ్ భార్య, కుమారుడు సుశాంతో భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఆగ్నేయ ఐరోపాలోని బాల్కన్ దేశమైన నార్త్ మాసిడోనియా పౌరసత్వం తీసుకున్నారు. కేసుల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులకు దూరంగా ఉండాలనే వారు దేశం విడిచి వెళ్లినట్టు చెబుతున్నారు.
Discussion about this post