తెలంగాణ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితాపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది. రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో గురువారం మరోసారి సమావేశం కానున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ… అభ్యర్థుల వడబోతపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే 55 మందితో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్… 30 నుంచి 40 మంది అభ్యర్థులతో రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉందంటున్నారు..
రెండో జాబితాపై కాంగ్రెస్ అధిష్టానానికి ఓ స్పష్టత వచ్చినట్లు చెబుతున్నారు. ఇప్పటికే 55 మంది అభ్యర్థులు ఖరారవడంతో మిగిలిన 64 నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ…. ఇందులో కూడా 30-40 నియోజకవర్గాలపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని చెబుతున్నారు. పది నుంచి పదిహేను నియోజకవర్గాల్లో ఎక్కువ మంది పోటీ పడుతుండటంతో… ఆయా నియోజకవర్గాల్లో ఎలా ముందుకు వెళ్లాలో తేల్చుకోలేకపోతోంది కాంగ్రెస్ హైకమాండ్.. ఈ నియోజకవర్గాలపైనే కేంద్ర ఎన్నికల కమిటీలో విస్తృతంగా చర్చలు జరిపినా.. ఏ నిర్ణయం తీసుకోలేకపోవడంతో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేపై భారం వేసింది ఎన్నికల కమిటీ….
కాంగ్రెస్‌లో మూడు దశల్లో అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. తొలి దశలో ఆశావహుల నుంచి దరఖాస్తులు తీసుకున్న కాంగ్రెస్ అధిష్టానం… పీసీసీ స్థాయిలో స్క్రీనింగ్ కమిటీలో చర్చించి… ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు ఉంటే వారి పేర్లను కేంద్ర ఎన్నికల కమిటీకి సిఫార్సు చేస్తుంది.. ఇలా పోటీ పడేవారిలో ఎవరు బెస్టో గుర్తించి హైకమాండ్‌కు నివేదిస్తోంది ఎన్నికల కమిటీ… ఈ విధంగానే తొలి జాబితాను రిలీజ్ చేసిన కాంగ్రెస్… రెండో జాబితాపై మాత్రం తీవ్రంగా చర్చిస్తోంది.. ఈ నెల 21, 22 తేదీల్లో ఢిల్లీలో రెండో జాబితాపై తీవ్ర కసరత్తు చేశారు కాంగ్రెస్ నేతలు.. దసరా సందర్భంగా రెండు రోజులు.. ఈ చర్చలకు విరామమిచ్చి బుధవారం పూర్తి చేయాలని నిర్ణయించారు.
మరో వారం రోజుల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండటం.. ప్రచారం చేసుకోవాల్సి వుండటంతో సాగదీత లేకుండా బుధవారమే ఏదో ఒకటి తేల్చేయాలని భావిస్తోంది కాంగ్రెస్ హైకమాండ్.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, స్క్రీనింగ్ కమిటీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలను ఢిల్లీకి పిలిపించింది. ఇంకా 64 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించాల్సివుండగా.. ఏకాభిప్రాయం కుదరని సీట్లను పక్కన పెట్టి… మిగిలిన జాబితాను బుధవారం రాత్రిలోగా విడుదలచేయాలని కసరత్తు చేస్తోంది..
మొత్తం 119 స్థానాలకు గాను ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది కాంగ్రెస్.. మిగిలిన 64లో కామ్రేడ్స్‌కు నాలుగు సీట్లు కేటాయించడంపై అవగాహన కుదిరింది. మిర్యాలగూడ, చెన్నూరు స్థానాలను సీపీఎం పార్టీకి… కొత్తగూడెం, వైరా సీట్లను సీపీఐకి ఇవ్వాలని నిర్ణయించింది కాంగ్రెస్. ఐతే సీపీఐ వైరా బదులు మునుగోడు టికెట్ కోరుతోంది. ఆ సీటును ప్రస్తుతానికి రిజర్వు చేసింది కాంగ్రెస్. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసి పార్టీలోకి వస్తుండటంతో… విషయం తేలేవరకు మునుగోడును రిజర్వు చేయాలనుకుంటోంది కాంగ్రెస్ నాయకత్వం… ఇలాంటి సమస్యలు ఉన్న పది పదిహేను స్థానాలు తప్ప మిగిలిన స్థానాలపై ఓ అవగాహన రావడంతో సెకండ్ లిస్టును క్లియర్ చేయాలనుకుంటోంది కాంగ్రెస్… సెకండ్ లిస్టు విడుదల చేసి రెండో విడత బస్సు యాత్రతోపాటు గడప గడపకు కాంగ్రెస్ ప్రచారంపై ఫోకస్ చేయాలని చూస్తోంది.
Discussion about this post