మాజీ ఎంపీ గెడ్డం వివేక్ వెంకటస్వామి బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ సమక్షంలో కుమారుడు వంశీతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కుమారుడు వంశీ రాజకీయ భవిష్యత్తు కోసమే వివేక్ పార్టీ మారినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు అనుకూల పవనాలు వీస్తున్నట్టు భావించడం కూడా కారణమని తెలుస్తోంది.
కాంగ్రెస్ లో వివేక్ చేరడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. రాజకీయ వారసత్వాన్ని కొడుకుకు అందించే ఏర్పాట్లలో భాగంగానే ఆయన సొంత గూటికి తిరిగి చేరుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి బలం చేకూరుస్తూ వంశీ తన యూట్యూబ్ ఛానెల్ లో కొద్ది రోజులుగా పొలిటికల్ పోస్టులు పెడుతూ వస్తున్నారు. విశాఖ ఇండస్ట్రీస్ జేఎండీ గా బాధ్యతలు నిర్వహించటంతో పాటు సొంత యూట్యూబ్ ఛానెల్ కోసం వంశీ పలువురు ప్రముఖుల్ని ఇంటర్వ్యూ చేశాడు. మణిపూర్ అల్లర్ల సమయంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వంశీ పోస్టులు పెట్టడం హాట్ టాపిక్ అయింది. తర్వాత ఆ పోస్టులను డిలీట్ చేసారు. కాంగ్రెస్ లో చేరి తాత బాటలో నడవాలన్నది వంశీ అభీష్టమని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే వివేక్ కాంగ్రెస్ గూటికి చేరారని చెబుతున్నారు.
కాంగ్రెస్ వాదిగా.. ఇందిరాగాంధీ కుటుంబానికి విశ్వాసపాత్రుడిగా ఎన్నో పదవులు అలంకరించిన గడ్డం వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వివేక్ 2009లో పెద్దపల్లి లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమం పతాక స్థాయిలో ఉన్నపుడు 2013 జూన్ లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 మార్చిలో తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లిపోయారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామని సోనియాగాంధీ చేసిన ప్రకటనకు ఆకర్షితుడై టీఆర్ఎస్ ను వీడినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. 2014 లో పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో మళ్లీ 2016 లో టీఆర్ఎస్ లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు.
అయితే 2018లో అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఆయన పోషించిన పాత్ర వివాదాస్పదమైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందేమోనన్న ఆలోచనతో టీఆర్ఎస్ లో ఉంటూనే పలువురు కాంగ్రెస్ అభ్యర్థులకు ఆర్థిక సాయం చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపధ్యంలో 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ వివేక్ కు లభించలేదు దీంతో ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు. తర్వాత పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న అసంతృప్తితో ఉన్న ఆయన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరిపోయారు.
Discussion about this post