ఒకప్పుడు ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా పేరొందిన ఆయన 83 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డాడు. తనను నమ్ముకున్న మదుపరులను నిలువునా ముంచేశాడు. మనీ లాండరింగ్, ఆర్ధిక మోసాలకు పాల్పడినట్టు రుజువవడంతో అమెరికాలోని న్యూయార్క్ కోర్ట్ అతడిని దోషిగా ప్రకటించింది. త్వరలో జైలు శిక్షను ఖరారు చేయనుంది. ఈ స్టోరీలో కథానాయకుడి పేరు శామ్ బ్యాంక్ మన్ ఫ్రైడ్. అతడి గురించి.. అతడి మోసాల గురించి తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది.
అమెరికాలోని స్టాన్ఫోర్డ్ లో 1992 మార్చిలో జన్మించిన శామ్ బ్యాంక్ మన్ ఫ్రైడ్ వాల్ స్ట్రీట్లో ఉద్యోగం చేసేవాడు. 2017లో వాల్ స్ట్రీట్లో ఉద్యోగం వదిలేసి అల్ మెడ రీసెర్చ్ పేరిట హెడ్జ్ ఫండ్ ను, క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజి ఎఫ్ టి ఎక్స్ ను నెలకొల్పాడు. అతడి తల్లిదండ్రులు స్టాన్ఫోర్డ్ లా స్కూల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్నారు. ఎఫ్ టి ఎక్స్ ను స్థాపించిన రెండేళ్ల తర్వాత క్రిప్టోలో భారీ ర్యాలీ వచ్చింది. దీంతో బ్యాంక్మన్ సంపద 26 బిలియన్ డాలర్లకు చేరింది. అప్పటికీ ఆయన వయసు 30 ఏళ్లు కూడా నిండలేదు.
బహమాస్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించిన బ్యాంక్ మన్.. వెరైటీ వెరైటీ ఆహార్యంతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. బిల్ క్లింటన్ వంటి హేమాహేమీలతోనూ షార్ట్స్ ధరించి సమావేశమయ్యేవాడు. హాలీవుడ్ సెలెబ్రిటీలతో భారీ ఎత్తున వాణిజ్య ప్రకటనలు చేయించి.. మార్కెట్ ను ముంచెత్తి క్రిప్టో కరెన్సీ సురక్షితమైన పెట్టుబడి మార్గమని విస్తృతంగా ప్రచారం చేసాడు. ప్రచార ఆర్భాటం కోసం వందలాది కోట్లు నీళ్లలా ఖర్చు చేసాడు.
బ్యాంక్మన్ కు చెందిన ఎఫ్ టి ఎక్స్, అలమెడా రీసెర్చ్ సంస్థల మధ్య ఉన్న సంబంధం ఏమిటనే అంశంపై వివాదం తలెత్తడంతో అతడి పతనం మొదలైంది. వాస్తవానికి ఈ రెండు కంపెనీలు వేర్వేరని బ్యాంక్మన్ చెప్పేవాడు. కానీ అది వాస్తవం కాదని తర్వాత తేలింది. ఈ విషయాన్ని కాయిన్డెస్క్ అనే వెబ్సైట్ బహిర్గతం చేసింది. అలమెడా ఆస్తుల్లో చాలావరకు ఎఫ్ టి ఎక్స్ ఆవిష్కరించిన క్రిప్టో టోకెన్ల రూపంలోనే ఉన్నట్లు తెలిపింది.
ఈ క్రిప్టో టోకెన్ల విలువ బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అప్పట్లో అలమెడా లెక్కగట్టింది. వాస్తవానికి టోకెన్లన్నీ ఈ రెండు సంస్థల అధీనంలోనే ఉన్నట్టు బయటకు రాగానే ఎఫ్ టి ఎక్స్ ప్రత్యర్థి సంస్థ బైనాన్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ వద్ద ఉన్న క్రిప్టో టోకెన్లను విక్రయించేసింది. దీంతో మిగతా ట్రేడర్లు సైతం తమ వద్ద ఉన్న టోకెన్లను వదిలించుకునేందుకు ఎగబడ్డారు. ఫలితంగా వీటి విలువ 75 శాతానికి పైగా పడిపోయింది. దీంతో అలమెడా ఆస్తుల విలువ పూర్తిగా ఆవిరైంది.
మరోవైపు ఎఫ్ టి ఎక్స్ నుంచి నిధులను ఉపసంహరించుకునేందుకు మదుపర్లు ఎగబడ్డారు. కానీ కస్టమర్లు, ఇన్వెస్టర్ల ఫండ్లను అప్పటికే ఎఫ్ టి ఎక్స్ అక్రమంగా అలమెడా లోన్ల కోసం తనఖా పెట్టేసింది. దీనివల్ల మదుపర్లకు చెల్లించేందుకు నిధులు లేక ఎఫ్ టి ఎక్స్ ఐపీ పెట్టేసింది. ఈ వ్యవహారంలో బ్యాంక్మన్ తో పాటు మరో ముగ్గురూ ఉన్నారు. వారంతా తప్పు చేసినట్టు కోర్టు ముందు అంగీకరించారు.
కస్టమర్లను మోసం చేయడం, అక్రమ నగదు చలామణి సహా మొత్తం ఏడు అభియోగాల్లో బ్యాంక్ మన్ దోషిగా తేలాడు. దాదాపు 83 వేల కోట్ల విలువైన ఆర్థిక నేరం జరిగినట్టు తేలింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో బ్యాంక్మన్ ను దోషిగా నిర్ధారించిన కోర్టు అతని శిక్షను త్వరలో ఖరారు చేయనుంది.
Discussion about this post