స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు ను ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. బాబు ను జైలుకు తరలించి 40 రోజులు దాటింది..కోర్టుల్లో ఆయన బెయిల్ కోసం దాఖలు చేసినప్పటికీ ఊరట లభించలేదు. నవంబర్ 9 వరకు ఆయన జైలులోనే గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పై అధికారపార్టీ వైసీపీ దృష్టి సారించింది.
విపక్ష నేత చంద్రబాబుకు ఎన్నికల్లోనూ చెక్ చెప్పేందుకు వైసీపీ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటి వరకు జరిగిన మున్సిపాలిటీ, పంచాయతీ, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో వైసీపీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ సవాళ్లు విసురుతోంది. ఇప్పుడు చంద్రబాబు జైలుకు వెళ్లడంతో కుప్పం నియోజకవర్గం చుక్కాని లేని నావలా మిగిలింది. లోకల్ గా ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నప్పటికీ అధినాయకుడు సీన్లో లేకపోవడంతో వారంతా నిరాశ ,నిస్పృహల్లో చిక్కుకుపోయారు. అధికారపార్టీ నేతలను ఎదుర్కోలేక పోతున్నారు
వైసీపీ వ్యూహాత్మకంగా కుప్పంలో చొచ్చుకుపోతోంది. సామ, దాన, దండోపాయాలు ప్రయోగిస్తోంది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను గడప గడపకు అందిస్తోందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ వర్గాల ప్రకారం.. చంద్రబాబు ఇప్పట్లో జైలు నుంచి బయటపడే అవకాశం లేదంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ వచ్చినా మరో కేసు.. అందులో బెయిల్ వచ్చే లోపు మరోకేసు ఇలా వరుస కేసులతో చంద్రబాబు బయటికి రాకుండా చూసే ఎత్తుగడలు వేస్తున్నారు.
ఈ క్రమంలోనే గుట్టుచప్పుడు కాకుండా కుప్పం నియోజకవర్గంలో జరగాల్సినవి జరిగిపోతున్నాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో గెలుపు బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జగన్ అప్పగించారు. సీఎం ఆదేశాల మేరకు పెద్దిరెడ్డి ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించారని చెబుతున్నారు. కుప్పంలో ఓవైపు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తూనే మరోవైపు టీడీపీ నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారని అంటున్నారు. తమ మాట విననివారిపై పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కుప్పాన్ని ఇప్పటికే రెవెన్యూ డివిజన్ గా ప్రకటించారు. ఆతర్వాత పెద్ద ఎత్తున నిధులతో వివిధ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నారు.
పేదలకు పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు అందిస్తున్నారు. అడిగిందే తడవుగా ఎవరికి ఏం కావాలంటే అవి చేస్తున్నారు. కొత్తగా 35 వేల మందికి సామాజిక భద్రత పింఛన్లు మంజూరు చేశారు. అలాగే ఇళ్ల స్థలాలు లేనివారికి వాటిని మంజూరు చేస్తున్నారు.కుప్పం నియోజకవర్గం అంతటా యుద్ధప్రాతిపదికన రోడ్లు వేయడంతోపాటు ఎక్కడెక్కడ కొరత ఉంటే అక్కడ తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అంతేకాకుండా చంద్రబాబును పెద్ద అవినీతిపరుడిగా చిత్రీకరించి కుప్పం అంతటా కరపత్రాలు పంచాలని వైసీపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. చంద్రబాబు జైలుపాలవడంతో కుప్పంలో సులువుగా గెలవొచ్చని వైసీపీ భావిస్తోంది.
1989 నుంచి చంద్రబాబు కుప్పం కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014 లో 47,121 ఓట్ల ఆధిక్యతతో బాబు గెలిచారు. 2019 లో బాబు మెజారిటీ 30,722 ఓట్లకు తగ్గింది. కుప్పం నుంచే 7 సార్లు గెలిచిన బాబు ను ఓటర్లు మళ్ళీ ఆదరిస్తారా ? తిరస్కరిస్తారా ?అనేది ఆసక్తికరంగా మారింది.
Discussion about this post