కెనడాలో జరిగిన ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపిస్తూ వివాదానికి తెర తీసిన కెనడా ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఇంతకు ముందు భారత దౌత్యవేత్తలను తమ దేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా ఆదేశించిన కెనడా ఇప్పుడు మరో ప్రతీకార చర్యకు దిగింది. బెంగళూరు, చండీగఢ్, ముంబై లలో వీసా, ఇన్ పర్సన్ కాన్సులర్ సేవలను తాత్కాలింగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే ఈ సేవలు ఢిల్లీలోని కెనడా హైకమిషన్ కార్యాలయంలో మాత్రం అందుబాటులో ఉంటాయని తెలిపింది.
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య అనంతరం కెనడా – భారత్ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతింటున్న సంగతి తెలిసిందే. తొలుత భారత దౌత్యవేత్తలను తమ దేశం నుంచి వెళ్లిపోవాల్సిందిగా కెనడా ఆదేశించడంతో భారత్ ప్రభుత్వం కూడా అలాంటి చర్యే తీసుకుంది. నెల రోజుల కిందట కెనడాలో వీసా సేవలను నిలిపి వేసింది. అంతేకాకుండా దేశంలో ఉన్న 41 మంది కెనడా దౌత్యవేత్తలు, వారి కుటుంబ సభ్యులకు దౌత్యపరంగా ఉండే మినహాయింపులను ఉపసంహరించింది.
కెనడా దౌత్యవేత్తలు, వారి కుటుంబ సభ్యులకు దౌత్యపరంగా ఉండే మినహాయింపులను ఉపసంహరిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న చర్యను కెనడా తీవ్రంగా తప్పుపట్టింది. ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని విమర్శించింది. ఢిల్లీలోను.. ఇతర నగరాలలోను ఉన్న కెనడియన్లు జాగ్రత్తగా ఉండాలని, రద్దీగా ఉండే ప్రాంతాలలో సంచరించవద్దని వారికి హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా బెంగళూరు, చండీగఢ్, ముంబై లలో వీసా, ఇన్ పర్సన్ కాన్సులర్ సేవలను తాత్కాలింగా నిలిపివేసింది.
Discussion about this post