తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ నిలబడినా.. ఇట్టే గెలిచేస్తారు. అందుకు నిదర్శనమే గతంలో జరిగిన అన్ని ఎన్నికలు. ఇన్నేళ్ల ఆయన రాజకీయ చరిత్రలో ఒక్కసారి మినహా ప్రతిసారీ గెలుపే ఆయనను వరించింది. కానీ.. ఈసారి మాత్రం పరిస్థితులు క్లిష్టంగా మారాయి. కేసీఆర్ మీద ఏకంగా 235 మంది పోటీకి దిగుతున్నారు. ఈ సారి కూడా ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అనుకుంటే ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి.. ఏలాగైనా ఇండిపెండెట్స్ను నామినేషన్ ఉపసంహరించుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి పార్టీ వర్గాలు చూడాలి వారి ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయో….
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి.. రెండు చోట్లలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కేసీఆర్‌ను ఓడించేందుకు ప్రత్యర్థి పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే.. గజ్వేల్‌లో బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా.. కామారెడ్డి నుంచి టీపీసీసీ అధ్యక్షుడు రేవంర్ రెడ్డి బరిలో దిగారు. రెండు చోట్లలో వీళ్లిద్దరు బలమైన నేతలే అయినప్పటికీ.. రాజకీయంగా ఎదుర్కొనేందుకు గులాబీ నేతలు అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. ఇక నామినేషన్ దాఖలు ప్రక్రియ పూర్తయ్యాక అసలు విషయం ఏమంటే కేసీఆర్ మీద ప్రత్యర్థులు ఒకరిద్దరు కాదు వందల మంది ఉన్నారు.
రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. అన్ని స్థానాల్లో కలిపి 4,798 మంది అభ్యర్థులు 5,716 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఇందులో.. అత్యధికంగా సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లోనే దాఖలు కావటం గమనార్హం. 145 మంది దాఖలు చేసిన 154 నామినేషన్లతో గజ్వేల్ మొదటి స్థానంలో ఉండగా.. 92 మంది వేసిన 104 నామినేషన్లతో కామారెడ్డి మూడో స్థానంలో ఉంది. రెండు స్థానాల్లో కలిపి కేసీఆర్ మీద మొత్తం 235 మంది పోటీ చేస్తున్నారు. దీంతో.. ఈ రెండు స్థానాల్లో పోటీ రసవత్తరంగా మారనుంది. ఈ రెండు స్థానాల్లో కేసీఆర్ గెలుపు నల్లేరు మీద నడకే అని ఊహించిన గులాబీ శ్రేణులకు.. నామినేషన్ల రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది.
గజ్వేల్ నియోజకవర్గంలో నామినేషన్లు వేసిన వారిలో వందకు పైగా రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లి భూముల బాధితులతో పాటు చెరుకు రైతులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మూతపడ్డ చెరుకు ఫ్యాక్టరీలు తెరిపించట్లేదన్న నిరసనతో రైతులు నామినేషన్లు వేశారు. ఇక.. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరపున 30కిపైగా నామినేషన్లు దాఖలయ్యాయి.
దీంతో.. రంగంలోకి దిగిన గులాబీ నేతలు నామినేషన్లను విత్‌డ్రా చేపించే పనిలో నిమగ్నమయ్యారు. నామినేషన్లు వేసిన అభ్యర్థులను నేతలు బుజ్జగిస్తున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 15 కావటంతో.. ఈలోపు అభ్యర్థులను బుజ్జగించేందుకు నానా తంటాలు పడుతున్నారు. చూడాలి ఎవరు గులాబీ బాస్‌కి మద్దతు పలుకుతారో … పోటీ పడతారో??
Discussion about this post