కాంగ్రెస్ స్ట్రాటజీ ఈ సారి చాల డిఫరెంట్ గా కనిపిస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని గట్టిగా నమ్ముతున్న కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కుంచుకోవాలని న్యూ స్ట్రాటజీ మొదలు పెట్టింది.. అదేంటో మీరే చూడండి.
తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రాజకీయపార్టీలు తమ కత్తులకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ రెగ్యులర్ స్ట్రాటజీ కాకుండా కొత్త స్ట్రాటజీతో వెళుతోంది.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సునీల్ కనుగోలు పాచికలు కదుపుతున్నారు. సునీల్ తన టీంతో రాష్ట్రం అంతా కూడా సర్వేలు నిర్వహించి గెలుపు గుర్రాల వేటలో పడ్డారు. అందులో భాగంగానే ఇతర పార్టీల్లో వున్న నాయకులకు ఎరవేసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకునేలా చేస్తున్నారు. ఇదే కాకుండా ముఖ్యమైన నేతలను తమ నియోజకవర్గంతో పాటు వేరే నియోజవర్గంలో కూడా పోటీ చేయడానికి సిద్దం చేస్తున్నాడు.
ఇందులో భాగంగానే ఇతర పార్టీల్లో గెలుపు గుర్రాలుగా చెప్పుకునే రాజగోపాల్ రెడ్డి , మైనంపల్లి హనుమంతరావు, లాంటి వారిని తమ వైపు తిప్పుకొని పార్టీ టిక్కెట్లను కేటాయించేసారు. దీంతో పాటు పార్టీపెద్దలను బుజ్జగిస్తూ అధికారంలోకి వచ్చాక పదవులు కట్టబెడతామంటున్నారు. ఇక బీఆర్ఎస్ ముఖ్యనాయకుల్ని కట్టడి చేయడానికి నడుం కట్టారు. ఇందులో బాగంగానే కేసీఆర్, హరీశ్ రావు, కేటీఆర్ పోటీ చేసే ప్రాంతాల్లో ముఖ్యనేతల్ని పోటీకి సిద్దం చేసారు. కేసీఆర్ పోటీ చేసే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీకి దిగనున్నారు. మరోవైపు గజ్వేల్లో రాజగోపాల్ ని రంగంలోకి దింపుతారంటున్నారు. కేసీఆర్ పోటీ చేసే రెండు ప్రాంతాలను అటు హరీశ్ ఇటు కేటీఆర్ తమ భుజస్కందాలపై వేసుకున్నారు. వాళ్ళిద్దరూ పార్టీకి స్టార్ క్యాంపైనర్స్ కాబట్టి వాళ్లిద్దరినీ అక్కడే నిలువరిస్తే ఇతర ప్రాంతాల్లో తమ నాయకులకు తిరుగుండదనుకుంటున్నారు. అంతేకాకుండా వాళ్లిద్దరు పోటీ చేసే సిరిసిల్ల, సిద్దిపేట్ లలో కూడా వీరిని ఓడించ వచ్చనే ఆలోచనలో వున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే కామారెడ్డిలో షబ్బీర్ అలీ టిక్కెట్ కావాలని పట్టుబడుతుండటంతో ఆయనకి నిజామాబాద్ లో వేరే నియోజకవర్గంలో చోటు కల్పించారు.
ఇప్పటికే మొదటి లిస్ట్ విడుదల చేసిన కాంగ్రెస్ రెండో లిస్ట్ ప్రిపరేషన్లో తలమునకలైంది. ఢిల్లీలో దీనిపై పలుమార్లు కాంగ్రెస్ సీఈసీ భేటీ అయ్యింది. కేసీ వేణుగోపాల్ , ఖర్గే, రాహుల్, రేవంత్ , భట్టితో కూడిన కమిటీ గెలుపు గుర్రాల వేటలో పడింది. ఇప్పటికే కొంతమందిని సెలక్ట్ చేసేసారు. అయితే ఆ లిస్ట్ తో సంబంధం లేకుండా కొంతమందికి నియోజకవర్గంలో ప్రచారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఇప్పటికే ఇతర పార్టీలనుండి నాయకులు రావడం జరిగినా మరికొంతమంది వచ్చే అవకాశాలు వుండటంతో ఆ స్థానాల్లో ఇప్పటికే వున్న వారిని బుజ్జగిస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఈ సారి పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అటు రేవంత్ ఇటు సునీల్ కనుగోలు తమ శాయసక్తులా పనిచేస్తున్నారు. వీరితో పాటు కర్ణాటకలో గెలుపుకి కారణమైన డీకే శివకుమార్ కూడా ఇక్కడ తిష్టవేసారు.
Discussion about this post