మానవులను నింగిలోకి పంపించే గగన్‌యాన్ ప్రాజెక్టు అమలుకు భారత్ శరవేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే గగన్‌యాన్ ప్రయోగంలో కీలక టెస్ట్‌లను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహిస్తోంది. గగన్‌యాన్ ప్రాజెక్టు గురించి ఇస్రో చీఫ్ సోమ్‌నాథ్ కీలక విషయాలు వెల్లడించారు. వచ్చే ఏడాది నింగిలోకి దూసుకెళ్లనున్న గగన్‌యాన్ ప్రాజెక్టులో మహిళల భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేస్తున్నారు. 2035 ఏడాది వరకు అంతరిక్షంలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు నిర్వహించేలా సొంతంగా భారత స్పేస్ స్టేషన్‌ను నిర్మించాలనే లక్ష్యంగా ముందుకెళుతోంది.
గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా మహిళా టెస్టు పైలట్లు, మహిళా సైంటిస్ట్లను భాగస్వామ్యం పెంచడానికి ఇస్రో ప్రయత్నిస్తోంది. వీటితోపాటు వచ్చే ఏడాది నింగిలోకి దూసుకెళ్లనున్న మానవ రహిత గగన్‌యాన్ స్పేస్ క్రాఫ్ట్‌లో మహిళా రోబోను పంపనున్నారు. ఈ మహిళా రోబో మనిషిని పోలి ఉంటుందని అంటున్నారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించడమే గగన్‌యాన్ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని ఇస్రో అంటోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోమూడు రోజులపాటు వ్యోమగాములను ఉంచి తిరిగి భూమి మీదికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఇస్రో 2035 కల్లా పూర్తిస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించే భారతీయ స్పేస్ స్టేషన్‌ను అంతరిక్షంలో నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన తొలి టెస్ట్ వెహికల్ ప్రయోగం కాస్త ఆలస్యంగానైనా విజయవంతమైంది. 12 కిలోమీటర్ల ఎత్తులో క్రూ ఎస్కేప్ వ్యవస్థ రాకెట్ నుంచి విడిపోయి.. 17 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా క్రూ ఎస్కేప్ మాడ్యూల్, క్రూ మాడ్యూల్ విడిపోయాయి. తర్వాత పారాచూట్లు విచ్చుకోవడంతో సెకనుకు 8.5 మీటర్ల వేగంతో క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగింది.
Discussion about this post