ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసిన గగన్ యాన్ తొలి పరీక్ష… టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ పరీక్ష విజయవంతమైంది. శ్రీహరికోటలోని ప్రయోగ వేదిక నుంచి రాకెట్ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్ పారాచ్యూట్ సాయంతో సముద్రంలో సురక్షితంగా దిగింది. గగన్ యాన్ మిషన్ లో కీలకమైన వ్యోమగాముల భద్రతకు సంబంధించిన ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసారు.
గగన్ యాన్ లో తొలి టెస్ట్ లాంచ్ విజయవంతమైందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. టీవీ- డీ1 మిషన్ ను విజయవంతంగా పరీక్షించామని… వ్యోమగాముల భద్రతకు సంబంధించిన వ్యవస్థ పనితీరు సమర్ధతను దీని ద్వారా విశ్లేషించగలుగుతామని ఆయన చెప్పారు. పారాచ్యూట్ లు సమయానికి తెరుచుకున్నాయని, క్రూ మాడ్యూల్ సురక్షితంగా బంగాళాఖాతంలో దిగిందని వెల్లడించారు.
గగన్ యాన్ తొలి దశలో నాలుగు పరీక్షలు చేయాల్సి ఉంది. వీటిలో టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్ మొదటిది. దీని ఫలితాల ఆధారంగా ఇస్రో తదుపరి పరీక్షలకు సిద్ధమవుతుంది. ఇందులో వ్యోమగాముల ఎస్కేప్ సిస్టమ్ సమర్థత, క్రూ మాడ్యూల్ పనితీరు, వ్యోమనౌకను క్షేమంగా కిందకి తెచ్చే డిసలరేషన్ వ్యవస్థ పటిష్ఠతను పరిశీలిస్తుంది. అలాగే సముద్ర జలాల్లో పడిన క్రూ మాడ్యూల్ ను తీరానికి తీసుకొచ్చే ప్రక్రియనూ పరీక్షించనుంది.
తొలుత ఈ ప్రయోగాన్ని ఉదయం 8 గంటలకు చేపట్టేందుకు ఇస్రో ప్రయత్నించింది. అయితే సాంకేతిక సమస్య రావడంతో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేశారు. తర్వాత లోపాన్ని గుర్తించి సరిచేశారు. ఉదయం 10 గంటలకు ఈ పరీక్షను ఇస్రో విజయవంతంగా పూర్తి చేసింది.
Discussion about this post