మెగాస్టార్ చిరంజీవి 156 వ సినిమా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకోనున్నదని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ తాజా సినిమా ప్రొడక్షన్ వర్క్ కు దసరా సందర్భంగా మంగళవారం శ్రీకారం చుట్టారు. ఫాంటసీ జానర్ లో తీస్తున్న ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల రూపాయల పైమాటేనని తెలుస్తోంది. బింబిసార సినిమా ఫేమ్ వశిష్ఠ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమా ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు క్లాప్ కొట్టగా అల్లు అరవింద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు చిత్ర యూనిట్ కు స్క్రిప్ట్ ను అందజేశారు. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మాట్లాడుతూ గతంలో ఉన్న సంప్రదాయం ప్రకారం మ్యూజిక్ రికార్డింగ్ తో పూజా కార్యక్రమాన్ని ప్రారంభించామని వివరించారు. సినిమాలో ఆరు పాటలు ఉంటాయని చెప్పారు. అద్భుతమైన పాటలు అందిస్తామని గీత రచయిత చంద్ర బోస్ చెప్పారు.
ఫాంటసీ జానర్ లో తీస్తున్న ఈ సినిమాలో దగ్గుబాటి రానా విలన్ గా నటించనున్నారని తెలుస్తోంది. చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీలో రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి డిఫెరెంట్ లుక్ లో కనిపిస్తారని చెబుతున్నారు. విలన్ పాత్రలో రానా కూడా చాల డిఫెరెంట్ గా ఉంటారని చిత్ర వర్గాలు అంటున్నాయి.
రాజకీయాలలో ఉండటం వల్ల, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల దాదాపు పదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి.. 2017 లో ఖైదీ నెం.150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చి మంది హిట్ కొట్టారు. తర్వాత చేసిన సైరా, గాడ్ ఫాదర్ పరవాలేదనిపించాయి. అనంతరం వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అవగా ఈ మధ్య చేసిన భోళా శంకర్ డిసాస్టర్ అయింది. ఈ నేపధ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ తాజా సినిమాకు మెగాస్టార్ సిద్ధమయ్యారు. దీనిపై అటు చిత్ర పరిశ్రమ వర్గాల వారు… ఇటు మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
Discussion about this post