రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీకి మళ్లీ బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. వారం రోజుల్లో మూడో సారి బెదిరింపు మెయిల్ రావటంతో రిలయన్స్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. షాదాబ్ ఖాన్ అనే అగంతకుడు బెల్జియం నుంచి ఈ మెయిల్స్ పంపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అడిగిన సొమ్ము ఇవ్వకపోతే తమ షూటర్లు కాల్చి చంపేస్తారని బెదిరించిన షాదాబ్ ఖాన్ తొలి మెయిల్ లో 20 కోట్లు డిమాండ్ చేసాడు. రెండో మెయిల్ లో 200 కోట్లు, మూడో మెయిల్ లో 400 కోట్లు డిమాండ్ చేసాడు. దీంతో దేశంలోని వీవీఐపీల భద్రతపై అందరి దృష్టి పడింది.
ప్రస్తుతం ముఖేష్ అంబానీ జడ్ ప్లస్ కేటగిరి భద్రతలో ఉన్నారు. దేశంలోని వీవీఐపీలకు అవసరాన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం తగిన భద్రత కల్పిస్తుంది. ఇందులో ఎస్.పీ.జి… జడ్ ప్లస్, జడ్, వై ప్లస్, వై , ఎక్స్ కేటగిరీలు ఉన్నాయి. ఎస్.పీ.జి.గా వ్యవహరించే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ కేవలం ప్రధాని, ఆయన కుటుంబ సభ్యుల భద్రతను చూస్తుంది. ఎస్.పీ.జి.లో మూడు వేల మంది సుశిక్షితులైన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమెండోస్ ఉంటారు. బులెట్ ప్రూఫ్ వాహనాలతోపాటు శక్తిమంతమైన డాగ్స్ కూడా ఉంటాయి. ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం 1985 లో ఎస్.పీ.జి.ని ఏర్పాటు చేయగా 1988లో పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసింది.
జడ్ ప్లస్ కేటగిరిలో సీ.ఆర్.పీ.ఎఫ్. కమెండోలతో పాటు 55 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉంటారు. అవసరమైతే 10 మంది వరకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమెండోస్ ను ఇస్తారు. బులెట్ ప్రూఫ్ వెహికల్ ఉంటుంది. 24 గంటలూ మూడు షిఫ్టులలో భద్రత కల్పిస్తారు. జడ్ కేటగిరిలో 22 మంది సిబ్బంది ఉంటారు. వీరిలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమెండోస్, పోలీస్ సిబ్బంది ఉంటారు. వై ప్లస్ కేటగిరిలో 11 మంది, వై కేటగిరిలో 8 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. ఎక్స్ కేటగిరీలో ఇద్దరు రాష్ట్ర పోలీసులు మాత్రమే ఉంటారు.
దేశంలో ప్రస్తుతం జడ్ ప్లస్ కేటగిరి భద్రతలో 40 మందికి పైగా ఉన్నారు. వీరిలో కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పారిశ్రామిక వేత్తలు ఉన్నారు. ఇక రాష్ట్రపతి భద్రత బాధ్యతను ప్రెసిడెంట్ బాడీగార్డ్ విభాగం చూస్తుంది. ఇందులో 180 మంది సిబ్బంది ఉంటారు. వీరిలో ఏడుగురు అధికారులు, 15 మంది జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లు ఉంటారు.
























Discussion about this post