టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బస్ యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారని కొద్దీ రోజుల క్రితమే “ఫోర్ సైడ్స్ టీవీ”చెప్పింది. ఫోర్ సైడ్స్ టీవీ చెప్పినట్టే భువనేశ్వరి బస్సు యాత్ర ప్రారంభించారు. ఇవాళ చంద్రగిరి మండలం నారావారి పల్లి నుంచి బయలు దేరి భువనేశ్వరి చంద్రగిరికి చేరుకున్నారు. అక్కడ చంద్రబాబు అరెస్ట్ అయ్యారన్న మనోవేదనతో మృతిచెందిన టీడీపీ కార్యకర్త ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ మీకు అండగా ఉంటుందని ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తర్వాత పాకాల మండలం నేండ్రగుంట కి చెందిన చిన్నప్ప కుటుంబాన్ని పరామర్శించడానికి బయలు దేరారు.
తర్వాత ఐరాల లో జరిగే భారీ బహిరంగ సభ లో భువనేశ్వరి పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడే మహిళలతో ముఖాముఖీ కార్యక్రమం లో పాల్గొంటారు. రేపు తిరుపతి జిల్లాలో ఆమె యాత్ర చేయబోతున్నారు. తిరుపతి లో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రసంగిస్తారు. ఈ సందర్భంగానే ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో కలిసి భువనేశ్వరి సహపంక్తి భోజనం చేస్తారు.
చంద్రబాబు అరెస్టుపై నిరసనలు చేపట్టి అరెస్ట్ అయిన జనసేన-టీడీపీ కార్యకర్తలను భువనేశ్వరి పలకరించనున్నారు. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు. తిరుపతి లోనే ఆటో డ్రైవర్లతో ఆమె సమావేశం కానున్నారు. 27న శ్రీకాళహస్తిలో మహిళలతో భువనేశ్వరి సమావేశం అవుతారు.ప్రధానంగా ఈ సభల ద్వారా జనం లోకి వెళ్తున్న భువనేశ్వరి చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ప్రచారం చేస్తున్నారు. నిన్నటివరకు స్తబ్దు గా ఉన్న పార్టీలో చురుకుదనం తేవాలనే లక్ష్యంతో “నిజం గెలవాలి” పేరిట ఈ యాత్ర సాగుతుంది.
Discussion about this post