టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బస్ యాత్రకు శ్రీకారం చుట్టారు. నిన్నటివరకు స్తబ్దు గా ఉన్న పార్టీలో చురుకుదనం తేవాలనే లక్ష్యంతో “నిజం గెలవాలి” పేరిట ఈ యాత్ర సాగుతుంది. ఇందులో భాగం గానే చంద్ర బాబు అరెస్ట్ వార్తలతో మనస్తాపం చెంది మరణించిన అభిమానులు, టీడీపీ కార్యకర్తల కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించనున్నారు. యాత్ర మధ్యలో పలుచోట్ల బహిరంగ సభలు, మీడియా సమావేశాలు, చిట్ చాట్‌లు నిర్వహించడానికి టీడీపీ నాయకత్వం ఏర్పాట్లు చేసింది. ఈ యాత్రలో భాగంగా మంగళ వారం తిరుమల శ్రీవారిని భువనేశ్వరి దర్శించుకున్నారు. అనంతరం అక్కడ్నుంచి నేరుగా నారావారి పల్లెకు చేరుకొని.. పెద్దల సమాధులకు నివాళులర్పించనున్నారు.
బుధవారం భువనేశ్వరి పరామర్శలు మొదలుపెట్టనున్నారు. మొదట..చంద్రబాబు అరెస్ట్‌తో మనోవేదనతో మృతిచెందిన టీడీపీ కార్యకర్త చిన్నబ్బ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఇక్కడ ప్రారంభమైన ఈ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. మూడు రోజులపాటు తిరుపతి జిల్లాలో ఆమె యాత్ర చేయబోతున్నారు. ఈ యాత్రలో భాగంగా అగరాల, తిరుపతి లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగానే ఐతేపల్లి మండలంలోని ఎస్సీ కాలనీలో పల్లె ప్రజలతో కలిసి భువనేశ్వరి సహపంక్తి భోజనం చేయబోతున్నారు. అనంతరం అగరాల బహిరంగసభలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై ప్రసంగిస్తారు. అగరాలలో మహిళలతో భువనేశ్వరి సమావేశం కానున్నారు.
ఆ తర్వాత గురువారం నాడు భువనేశ్వరి తిరుపతికి రానున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై నిరసనలు చేపట్టిన జనసేన-టీడీపీ కార్యకర్తలపై పలుచోట్ల పోలీసులు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వారందరితో భువనేశ్వరి సమావేశమై పరామర్శించి.. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా కల్పించనున్నారు. అక్కడ కూడా బహిరంగ సభను టీడీపీ నాయకులు ఏర్పాటు చేశారు. అనంతరం ఆటో డ్రైవర్లతో ఆమె సమావేశం కానున్నారు. 27న శ్రీకాళహస్తిలో మహిళలతో భువనేశ్వరి సమావేశం కాబోతున్నారు. ప్రధానంగా ఈ సభల ద్వారా జనం లోకి వెళ్తున్న భువనేశ్వరి చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటూ ప్రచారం చేసి తద్వారా సానుభూతి సంపాదించాలని యోచిస్తున్నారని ప్రత్యర్థి వర్గాలు అంటున్నాయి . అలాగే డీలా పడిన పార్టీ నేతల్లో ,కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది . భువనేశ్వరి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
Discussion about this post