తెలుగుదేశం పార్టీలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు ప్రత్నామ్నాయం ఎవరు? గత కొద్ది రోజులుగా పార్టీలోను, పార్టీ బయట వినిపిస్తున్న ప్రశ్న ఇది. ఇపుడు ఆయన సతీమణి భువనేశ్వరి “నిజం గెలవాలి” పేరిట బస్ యాత్ర చేస్తూ జనంలోకి వెళ్తున్న తీరు చూస్తుంటే … ఆమె ఖచ్చితంగా బాబు కి ప్రత్యమ్నాయమని అనుకోవాలి. ఇదంతా బాబు వ్యూహమే అని కూడా చెప్పుకోవాలి. తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పుకుంటూ ఒక మహిళ గా జనంలో కెళ్తే అంతో ఇంతో సానుభూతి వస్తుందని బాబు అంచనా వేస్తున్నారు. ఈ వ్యూహం ఫలించి సానుభూతి పెరిగితే తద్వారా ఎన్నికల్లో WORKOUT అవుతుందని బాబు లెక్కలు వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
స్కిల్ స్కాం కేసులో చిక్కుకుని అరెస్టు అయి రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు సూచన మేరకే భువనేశ్వరి బస్ యాత్ర ప్రారంభించారని చెబుతున్నారు. వాస్తవానికి బాబు మాదిరి ఆర్దిక వ్యవహారాలు, ఇతరత్రా మానిప్యులేషన్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ ఉన్న నేతలు పార్టీలో ఎవరూ లేరు.. తనయుడు లోకేష్ కి అప్పగించినా అతగాడు చేయగలడన్న నమ్మకం లేకనే.. భువనేశ్వరిని బాబు ఎంచుకున్నారని పరిశీలకులు అంటున్నారు. కోట్లాది రూపాయలు పెట్టి నియమించుకున్న లాయర్లు ఎంత ప్రయత్నించినా 17 a కొట్టేసే సూచనలు కనిపించడం లేదు. బెయిల్ పిటీషన్లు కూడా వాయిదా పడుతున్నాయి. ఇప్పటికే రిమాండ్ కొచ్చి 45 రోజులు దాటింది. ఇతర కేసులు కూడా పెడుతున్నారు. బెయిల్ ఎప్పటికి వస్తుందో ? రాదో ఎవరూ చెప్పలేకపోతున్నారు. సత్వరమే జైలు నుంచి విడుదల అయితే ఫర్వాలేదు. అలా కాకుంటే పార్టీ పరిస్థితి ఏమిటి అన్నది బాబు మెదడు ను తొలచివేస్తున్న ప్రశ్న. కలవరపెడుతున్న సమస్య.
మరో ఏడెనిమిది కేసులు బాబును వెంటాడుతున్నాయి. అవి అన్ని ఒక్కసారిగా వచ్చి మీద పడితే కనీసం రెండు, మూడు నెలలపాటు జైలులో ఉండవలసి రావచ్చన్న అభిప్రాయం ఉంది. అదే నిజమైతే పార్టీ గందరగోళంలో పడుతుంది. పోనీ లోకేష్ నాయకత్వం సరిపోతుందా అనుకుంటే పార్టీలో ఆయనపై అంత నమ్మకం లేదు. ఈ మధ్య ఆయన అభ్యర్దుల ప్రకటన, మరికొన్ని నిర్ణయాలు సొంతంగా తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నా, అంత మెచ్యూరిటీ ఇంకా రాలేదని బాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇదే స్కిల్ స్కామ్ కేసులో లోకేష్ కూడా అరెస్టు అయితే పరిస్థితి మరింత దయనీయంగా తయారవుతుంది. ఇవన్నీ ఆలోచించే బాబు భువనేశ్వరిని రంగం లోకి దించారని పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. తొలుత బ్రాహ్మణీ ని రంగంలోకి దింపాలని బాబు భావించినప్పటికీ …. హేరిటేజ్ కంపెనీ , ఆర్ధిక వ్యవహారాలు చూసుకునే నమ్మకమైన మనిషి దొరకరని బాబు భావించినట్టు చెబుతున్నారు.
ఇక బావమరిది బాలకృష్ణకు నాయకత్వ బాద్యతలు అప్పగించడం బాబుకు అంత ఇష్టం లేదనిపిస్తుంది. బాలకృష్ణ పార్టీ కార్యాలయంలో కాస్త హడావుడి చేసినట్లు కనిపించినా, యనమల రామకృష్ణుడు వంటి సీనియర్‌లు ఏదో మొక్కుబడిగా కూర్చున్నారు తప్ప అంత సీరియస్ నెస్ చూపలేదు. పైగా బాలకృష్ణ టెంపర్ మెంట్ రీత్యా ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో తెలియదు. ఆయన తన ఇంటిలో ఇద్దరు సినీ ప్రముఖులను తుపాకితో కాల్చిన ఘట్టాన్ని , కొన్ని చోట్ల తన అభిమానులపై చేయి చేసుకోవడాన్ని గుర్తు చేస్తున్నారు.
ఈ నేపద్యంలోనే ఆంధ్రజ్యోతి మీడియా బాలకృష్ణ పార్టీ కార్యాలయంలోకాని, ఇతరత్రాకాని గత కొద్దిరోజులుగా చేసిన యాక్టివిటికి ఎలాంటి పబ్లిసిటీ ఇవ్వలేదని అంటున్నారు. ఈనాడు మీడియా కూడా అదే రీతిలో ఆయనకు ప్రాముఖ్యత తగ్గించింది. కొద్దీ రోజుల క్రితం తెలంగాణ పార్టీని కూడా తానే చూస్తానని .. ఎన్నికల్లో పోటీ చేద్దామని బాలకృష్ణ ప్రకటించారు .. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. దీన్ని బట్టి ఆయనకు కూడా గ్రీన్ సిగ్నల్ బాబు ఇవ్వలేదని అంటున్నారు.
ఈ పరిస్థితిలోనే చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైనే ఆదారపడవలసి వచ్చింది. ఆయన రెండు పార్టీల తరపున పర్యటనలు చేస్తే ప్రయోజనంగా ఉంటుందేమోనన్న ఆలోచన చేసి ఉండవచ్చు. కానీ పూర్తిగా పవన్ పై ఆధార పడకుండా భువనేశ్వరి ని రంగంలోకి దింపితే పరిస్థితి మెరుగు పడవచ్చని చంద్రబాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల నాటికైనా బెయిల్ వస్తే తానే స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని కంట్రోల్ కి తెచ్చుకోవచ్చని బాబు యోచనగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇపుడు సైలెంట్ గా ఉంటే జగన్- పార్టీ ని కబ్జా చేస్తారనే భయం కూడా బాబుకి ఉందని చెబుతున్న్నారు. అందుకే అన్నీ ఆలోచించి భువనేశ్వరి బస్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. తాను జైలు నుంచి బయటకు రాకపోయినా పార్టీ అధికారంలోకి వస్తే భువనేశ్వరిని సీఎం చేయవచ్చు అనేది బాబు అసలు ఆలోచన గా చెబుతున్నారు.
Discussion about this post