మధుమేహం…అంటే డయాబెటీస్.. ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది దీనితో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇండియాలో మధుమేహ బాధితులు ఇప్పటికే 10 కోట్లమందికి పైగా ఉండగా మరో 13 కోట్ల మంది ఈ మహమ్మారి బారినపడే దశలో ఉన్నారు. రాబోయే పదేళ్లలో ఇండియాలో 45 కోట్ల మంది షుగర్ వ్యాధి బారిన పడతారని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరించింది. మధుమేహానికి నివారణ మందులేవీ లేవన్న సంగతి తెలిసిందే. నియంత్రణకు మాత్రమే మందులు, మార్గాలు ఉన్నాయి. జోహా, జుమ్లీ మార్షి రకాల బియ్యం మధుమేహ బాధితులకు మేలు చేస్తాయని పరిశోధనల్లో వెల్లడైంది.
జీవనశైలిని మార్చుకోవడంతో పాటు ఆహార అలవాట్లను క్రమబద్ధీకరించుకుంటే మధుమేహాన్ని చాలావరకు నియంత్రణలో ఉంచుకోవచ్చు. ప్రధానంగా రైస్ అంటే వరి అన్నం తినవద్దని డాక్టర్లు చెప్పడం సర్వ సాధారణం అయిపోయింది. అయితే చాలా మంది వరి అన్నం తినకుండా ఉండలేరు. ఇలాంటి వారికి ఆ రెండు రకాల బియ్యం వరప్రసాదమనే చెప్పాలి.
ఈశాన్య రాష్ట్రాల్లో పండించే జోహా బియ్యం…, భారత్, పాకిస్తాన్, నేపాల్ దేశాలలో ఉన్న హిమాలయ పర్వత ప్రాంతాలలో పండించే జుమ్లీ మార్షి రకం బియ్యం మధుమేహ బాధితులకు ఎంతో మేలు చేస్తాయని పరిశోధనల్లో తేలింది. రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించడంలో, మధుమేహం రాకుండా నిరోధించడంలో ఈశాన్య రాష్ట్రాల్లో పండించే జోహా రకం వరి బియ్యం ఉపయోగపడుతోందని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ శాస్త్రవేత్తలు తేల్చారు. జోహా బియ్యం రక్తంలోకి గ్లూకోజ్ ను నెమ్మదిగా విడుదల చేస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది.
జోహా అనేది ఒక సన్నధాన్యం రకం. శీతాకాలంలో పండుతుంది. మంచి సువాసనతో ఉండే జోహా బియ్యంతో వండిన అన్నం చాలా రుచిగా ఉంటుంది. వీటిని రెగ్యులర్ గా తినేవారిలో మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు తక్కువగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఈ రకం బియ్యంలో లినోలిక్ యాసిడ్, లినోలెనిక్ యాసిడ్ అనే రెండు ఫ్యాటీ యాసిడ్లను గుర్తించారు. ఇవి మానవుల్లో సహజంగా ఉత్పత్తి కావు. ఈ కొవ్వు ఆమ్లాలు వివిధ శరీర క్రియలను నిర్వహించడానికి సహాయపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ యాసిడ్లు రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించడంలో, ప్రభావవంతంగా పనిచేస్తున్నట్టు నిర్ధారణ అయింది. దీంతో జోహా బియ్యం వినియోగంపై వైద్య వర్గాలలో చర్చ జరుగుతోంది.
భారత్, పాకిస్తాన్, నేపాల్లలోని పర్వత ప్రాంత ప్రజలు జుమ్లీ మార్షి రకం బియ్యంతో వండే అన్నాన్నిఎక్కువగా తింటారు. వారు తినే ఆహార పదార్ధాలలో ఈ అన్నమే అత్యంత పోషకమైనది. ఈ వ్యాధి-నిరోధక ‘జుమ్లీ మార్షి’ రకం పంట రైతులకు లాభాలను కూడా తెచ్చిపెడుతోంది. సుమారు 550 ఏళ్ల క్రితం మొదటిసారిగా దీనిని సాగు చేసినట్లు చెబుతారు. గులాబీ రంగులో ఉండే ఈ వరిలో ఫైబర్, ప్రొటీన్లు, ఐరన్, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. మధుమేహంతో బాధపడే వారు ఈ బియ్యం తింటే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Discussion about this post