తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తొలిసారిగా ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఎమ్మెల్యే టికెట్ కేటాయించి అందరి దృష్టినీ ఆకర్షించారు. తెలుగు రాష్ట్రాలలో ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం ఇదే మొదటి సారని పరిశీలకులు చెబుతున్నారు. వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్న ఈ ట్రాన్స్‌జెండర్ గురించి ప్రస్తుతం పెద్ద చర్చ జరుగుతోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం బహుజన సమాజ్ పార్టీ 43 మంది అభ్యర్ధులతో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ లిస్టులో పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఓ ట్రాన్స్‌జెండర్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నట్టు వెల్లడించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి చిత్తారపు పుష్పిత లయ అనే ట్రాన్స్‌జెండర్ పోటీ చేయబోతున్నారని తెలిపారు.
దీనిపై రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్లందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కరీమాబాద్‌లో నివాసముంటున్న పుష్పిత లయ కొన్నాళ్లుగా బీఎస్పీలో చురుకుగా పనిచేస్తున్నారు.
హక్కుల సాధన కోసం దేశవ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్లు అవిశ్రాంత పోరాటాలు చేస్తున్నారు. రాజకీయాల్లో కూడా రాణించాలని భావిస్తున్నారు. రాజకీయ, అధికార పదవులు దక్కితే హక్కుల సాధన మరింత సులువవుతుందని, తమ వాణిని గట్టిగా వినిపించవచ్చని అనుకుంటున్నారు. ఇందులో భాగంగా వివిధ రాజకీయ పార్టీల నేతలను కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కానీ ప్రధాన రాజకీయ పార్టీలు వారి వేదనను ఇంతవరకు పట్టించుకోలేదు. బీఎస్పీ పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం సానుకూలంగా స్పందించి పుష్పిత లయకు టికెట్ ఇచ్చారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తనకు టికెట్ ఇవ్వటంపై పుష్పిత లయ హర్షం వ్యక్తం చేసారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు తనను గెలిపిస్తే అభివృద్ధిలో తన మార్కు చూపిస్తానని చెబుతున్నారు. ప్రజా ప్రతినిధిగా తన ప్రత్యేకతను చాటుకుంటానని అంటున్నారు. మరి నియోజకవర్గ ప్రజలు పుష్పిత లయను ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.
Discussion about this post