రాజస్థాన్‌లో ఎలాగైనా కాంగ్రెస్‌ను గద్దె దించి అధికారంలోకి రావాలని తహతహలాడుతున్న బీజేపీ ఇప్పుడు తిరుగుబాటు అభ్యర్థులతో సమస్యను ఎదుర్కొంటోంది. దీనిని పరిష్కరించటానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, అగ్రనేతలు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. అయితే అమిత్‌షా ఫోన్ చేసి బుజ్జగిస్తున్నా, కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నేరుగా కలిసి విజ్ఞప్తి చేసినా తిరుగుబాటు అభ్యర్థులు వెనక్కి తగ్గకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది.
బీజేపీ అధిష్టానం తమను కాదని వేరేవారికి సీట్లు కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్న నేతలు 25కిపైగా స్థానాల్లో ఇండిపెండెంట్లుగా పోటీచేస్తున్నారు. వీరికే స్థానిక కార్యకర్తలు మద్దతిస్తుండడంతో అధికారిక అభ్యర్థులు కంగారు పడుతున్నారు. మరోవైపు… పార్టీలో కాంగ్రెస్ మాదిరిగా ‘హైకమాండ్’ సంస్కృతి పెరిగిపోవడం, రాష్ట్ర నాయకత్వాన్ని డమ్మీగా చేయడాన్ని చాలామంది రాష్ట్ర నాయకులు సహించలేకపోతున్నారు.
రాజస్థాన్ అసెంబ్లీలో 200 సీట్లు ఉండగా నవంబర్ 25 న పోలింగ్ జరగనుంది. సమయం దగ్గర పడుతుండటంతో తిరుగుబాటు అభ్యర్థులు ఉన్న చోట్ల బీజేపీ అభ్యర్థులకు నిద్ర పట్టడం లేదు. మాజీ సీఎం వసుంధర రాజే సన్నిహితుడు రాజ్‌పాల్‌సింగ్ షెకావత్‌కు జోత్వారా టికెట్ లభించలేదు. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ అధికారిక అభ్యర్థిగా ఉన్నారు. ఆయనపై ఆషుసింగ్ సుర్పురా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు. వసుంధరకు మరో సన్నిహితుడు యూనస్ ఖాన్‌కు కూడా టికెట్ దక్కలేదు. దీంతో ఆయన డీడ్వానాలో పార్టీ అభ్యర్థి జితేంద్ర జోధాపై ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నారు.
చితోడ్‌గఢ్ టికెట్‌ను మాజీ ఉపరాష్ట్రపతి భైరాన్‌సింగ్ షెకావత్ అల్లుడు నర్పత్సింగ్ రాజ్వీకి ఇచ్చారు. దీంతో సిటింగ్ ఎమ్మెల్యే చంద్రభాన్‌సింగ్ ఆక్య, షాపురా ఎమ్మెల్యే కైలాస్ మేఘ్వాల్ రెబెల్స్‌గా బరిలో దిగారు. 200 స్థానాల్లో ఒక్క ముస్లింకు కూడా బీజేపీ ఈ దఫా టికెట్ ఇవ్వకపోవడం గమనార్హం. కేంద్ర మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ తనకు టికెట్ రాకుండా అడ్డుపడ్డారని దళిత నాయకుడైన కైలాస్ మేఘ్వాల్ మండిపడుతున్నారు. శివ్, సాంచోర్, సవాయ్ మధోపూర్, కిషన్‌గఢ్, బర్మేర్, ఖండేలా తదితర స్థానాల్లో కూడా రెబెల్స్ బరిలో ఉన్నారు.
అభ్యర్థుల ఎంపికలో రాష్ట్ర నాయకత్వానికి స్వేచ్ఛ ఇవ్వకపోవడంపై సీనియర్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. భైరాన్‌సింగ్ షెకావత్ సీఎంగా ఉన్నప్పుడు.. ఆయన ఫోన్ చేస్తే రెబెల్స్ మరోమాట లేకుండా వైదొలిగేవారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
రాజస్థాన్‌లో సీఎం అభ్యర్థిపై బీజేపీ అధిష్టానం ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మాజీ సీఎం వసుంధర రాజే ఈ పదవిని ఆశిస్తున్నా అధిష్ఠానం ఆమె పట్ల సానుకూలంగా లేదని చెబుతున్నారు. తొలి జాబితాలో ఆమెకు స్థానం కల్పించకపోవటమే దీనికి నిదర్శనమని అంటున్నారు. రెండో జాబితాలో మాత్రమే వసుంధర రాజేకు టికెట్ దక్కింది. ఆమె తన సొంత నియోజకవర్గం జల్రాపటన్ నుంచే పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ లో బీజేపీ విజయావకాశాలపై ఉత్కంఠ నెలకొంది.
Discussion about this post