సైబర్ మోసాలు, హ్యాకింగ్ రోజురోజుకు పెరిగిపోతున్నా యూజర్ల తీరు మారటం లేదు. సైబర్ నేరాలకు, డేటా చోరీకి అవకాశం లేకుండా చేయడానికి బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలని సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థలు, సైబర్ నిపుణులు పదేపదే చెబుతున్నా చాలామంది నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పనామా కేంద్రంగా పని చేస్తున్ననార్డ్‌పాస్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ పాస్ వర్డ్ లపై ఓ అధ్యయనం చేసింది. ప్రపంచంలోనే అత్యధిక మంది వినియోగిస్తున్న మోస్ట్ కామన్ పాస్‌వర్డ్ ‘123456’ అని తేల్చింది. అందుకే ‘123456’ ని పరమ చెత్త పాస్ వర్డ్ గా అభివర్ణించింది.
ఇలాంటి మోస్ట్ కామన్ పాస్ట్‌వర్డ్‌లను కనుక్కోవడానికి సైబర్ నేరస్తులకు ఒక్క సెకను చాలని నార్డ్‌పాస్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా ‘123456’ పాస్ వర్డును దాదాపు 45 లక్షల మంది వినియోగిస్తున్నారని వెల్లడించింది. ఇక ‘అడ్మిన్’ అనే పాస్ వర్డ్ రెండో స్థానంలో నిలిచింది. దీనిని దాదాపు 40 లక్షల మంది వినియోగిస్తున్నారు. మూడో స్థానంలో12345678 అనే పాస్ వర్డ్ ఉంది. దీనిని 13.7 లక్షల మంది యూజర్లు వినియోగిస్తున్నారు.
ఇక భారత్‌లో ఎక్కువ మంది వినియోగిస్తున్న పాస్‌వర్డ్ ‘123456’. దాదాపు 3.6 లక్షల అకౌంట్లకు ఇదే పాస్‌వర్డ్ ఉంది. అలాగే ‘అడ్మిన్’ పాస్‌వర్డ్ ను 1.2 లక్షల మంది వినియోగిస్తున్నట్లు నార్డ్‌పాస్ వెల్లడించింది. 6.6 టెరాబైట్ల డేటాబేస్‌ను స్టీలర్ మాల్వేర్ల సాయంతో యాక్సెస్ చేసి ఈ అధ్యయనం చేసినట్టు ఆ సంస్థ తెలిపింది. ఇతర వెబ్‌సైట్లతో పోలిస్తే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే యూజర్లు అత్యంత బలహీన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారని వివరించింది. ఇప్పటికైనా యూజర్లు తమ నిర్లక్ష్య వైఖరిని మార్చుకోవాలని సూచించింది. పాస్‌వర్డ్‌లో అప్పర్‌కేస్, లోయర్‌కేస్ ఆంగ్ల అక్షరాలు, అంకెలు, స్పెషల్ క్యారెక్టర్లు ఉండేలా చూసుకోవాలని సలహా ఇచ్చింది.
Discussion about this post