త్వరలో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా లేదా అనే విషయం అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. గతంలో 87 నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని టీ-టీడీపీ అధినేత కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. ఆ తర్వాత నటుడు హిందూపూర్ ఎమ్మెల్యే Balakrishna కూడా పోటీ కి రెడీ అన్నట్టు ప్రకటించారు. అయితే ఇప్పుడు రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోటీ నుంచి వెనుకడుగు వేసినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉండబోతుందని చెప్పుకుంటున్నారు.
చంద్రబాబు స్కిల్ స్కాం కేసులో అరెస్ట్అయి జైలులో ఉన్న నేపథ్యంలో ఆయన తనయుడు లోకేష్ కొద్దీ రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిశారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు … టీడీపీ తన ఓట్లన్నీ బీజేపీకి మళ్లిస్తూ … ఎన్నికలకు దూరంగా ఉండాలని టీడీపీని కోరినట్లు సమాచారం. ఇందుకు బదులుగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి బీజేపీ సహకరిస్తుందని ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఒక అవగాహన కుదిరిందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలీదు కానీ తెరవెనుక ఏదో జరిగిందని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో తెలంగాణలో టీడీపీ పూర్తిగా ఎన్నికలకు దూరంగా ఉండనుందని తెలుస్తోంది.
ఏపీ లో బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది కానీ టీడీపీతో పొత్తుకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు. తెలంగాణలో కూడా జనసేన బీజేపీల మధ్య పొత్తుకుదిరినట్టు ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహాలు,ప్రచార కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాయి.తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది,విజయం సాధించేందుకు అన్ని అంశాలపై అగ్రనేతలు అధ్యయనం చేశారు. ఆ మేరకు కసరత్తు చేస్తున్నారు.
Discussion about this post