ఫోర్ సైడ్స్ ప్రేక్షకులకు నమస్కారం. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ.. ఈ పండగపై ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ ఫోకస్ . తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. ఆడపడుచులందరూ సంబరంగా జరుపుకునే వేడుక బతుకమ్మ. ప్రకృతిని ఆరాధిస్తూ, అనుబంధాలను గుర్తుచేస్తూ సాగే పూల ఉత్సవం బతుకమ్మ. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కమనీయ దృశ్యం బతుకమ్మ. తెలంగాణాకే ప్రత్యేకమై, విశ్వ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బతుకమ్మ వేడుకలు శనివారం ప్రారంభమయ్యాయి. బతుకమ్మ వేడుకలను 9 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకుంటారు. బతుకమ్మ సంబరాలు పితృ అమావాస్యనాడు ప్రారంభమై తొమ్మిది రోజులపాటు సాగుతాయి. ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే ఈ సంబరాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులపాటు మహిళలు ప్రకృతిలో దొరికే రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆడి పాడి, అత్యంత భక్తిశ్రద్ధలతో గౌరీదేవిని పూజించి, అందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు.
ఆశ్వయుజ అమావాస్య అయిన పితృ అమావాస్య నాడు నేడు ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ నాడు మహిళలు చక్కగా ముస్తాబై, గునుగు, తంగేడు, కట్ల, మొల్ల, సీత జడలు, రుద్రాక్ష, మందార, పారిజాతం, కమలం, తామర, గన్నేరు వంటి రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా పాటలు పాడుతూ ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మకు స్వాగతం పలుకుతారు.
తెలంగాణ గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా ఉండే జానపద గీతాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవడం విశేషం. ఎంగిలిపూల బతుకమ్మగా మొదటి రోజు ఉదయం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి పూజిస్తారు. తొలిరోజు అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి ప్రసాదం తయారు చేస్తారు. ఇంట్లో ముందుగా బతుకమ్మను పూజిస్తారు. ఆపై సాయంత్రం సమీపంలో ఉన్న గుడులలో, చెరువుల వద్ద మహిళలంతా గుమికూడి సమిష్టిగా బతుకమ్మ వేడుకలు జరుపుకుంటారు.
బతుకమ్మ తయారీ కోసం ఒక రోజు ముందే పూలను సేకరించి అలా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తారని పెద్దలు చెబుతారు. కొన్ని ప్రాంతాలలో తిన్న తర్వాత బతుకమ్మను పేరుస్తారు. కాబట్టి ఎంగిలి పూల బతుకమ్మ అని పేరు వచ్చినట్టుగా చెప్తారు. ఏది ఏమైనా బతుకమ్మ ఓ కమనీయ పూల సంబరం.. తెలంగాణాకే తలమానికమైన వైభవం.
Discussion about this post