ఆంధ్రప్రదేశ్, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జనాభా పరంగా బీసీలే మెజారిటీ. కానీ రాజకీయంగా వారికి దక్కాల్సిన ప్రాధాన్యం, అధికార పదవుల్లో వాటా ఇంతవరకు లభించలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడూ ఇదే పరిస్థితి. అటు ఉమ్మడి రాష్ట్రంలోను, ఇటు విడిపోయాక కూడా ఇంతవరకు ఒక్క బీసీ నాయకుడు కూడా ముఖ్యమంత్రి కాలేకపోయారంటే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ ఇది నిప్పులాంటి నిజం. అందుకే బీజేపీ ఈ సారి తెలంగాణ ఎన్నికల్లో బీసీ అస్త్రాన్ని ప్రయోగించింది
అక్టోబర్ 27న సూర్యాపేటలో ‘జన గర్జన’ పేరిట బీజేపీ నిర్వహించిన సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ తెలంగాణాలో బీజేపీని గెలిపిస్తే బీసీని సీఎం చేస్తామని ప్రకటించారు. దీంతో బీసీల్లో కొత్త ఆశలు చిగురించాయి. తర్వాత ఈ హామీనే ప్రధాన అస్త్రంగా చేసుకోవాలని బీజేపీ జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు గట్టిగా యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత ఏపీ, తెలంగాణలకు ఏయే కులాల నేతలు సీఎంగా అయ్యారో తెలుసుకోవటం ఆసక్తి కలిగిస్తుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడున్న రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూస్తే 10 మంది రెడ్డి నేతలు, ముగ్గురు కమ్మ నేతలు, ఇద్దరు వెలమ నేతలు.. బ్రాహ్మణులు, వైశ్యులు, దళితులు ఒక్కొక్కరు చొప్పున ముఖ్యమంత్రులయ్యారు. దక్షిణాదిలో ఇప్పటివరకు బీసీలు సీఎం కానిది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలే కావటం విస్తుగొలిపే వాస్తవం.
1948 సెప్టెంబర్ 17 వరకు హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో ఉండేది. సెప్టెంబర్ 17న ‘ఆపరేషన్ పోలో’ తరువాత భారతదేశంలో చేరింది. దీనిని హైదరాబాద్ రాష్ట్రంగా ప్రకటించి ముల్లాత్ కల్లాడి వెల్లోడీ అనే సివిల్ సర్వీసెస్ అధికారిని ముఖ్యమంత్రిగా నియమించింది అప్పటి ప్రభుత్వం. 1950 నుంచి 1952 వరకు సీఎంగా ఉన్న వెల్లోడీ తమిళనాడుకు చెందినవారు. తర్వాత బూర్గుల రామకృష్ణారావు సీఎం అయ్యారు. ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవారు.
కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి 1956 నవంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
దీనికి ముందున్న ఆంధ్ర రాష్ట్రానికి టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి సీఎంలుగా పనిచేశారు. ప్రకాశం పంతులు బ్రాహ్మణ కులానికి, గోపాలరెడ్డి రెడ్డి కులానికి చెందినవారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 16 మంది ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి. తరువాత దామోదరం సంజీవయ్య సీఎం అయ్యారు. సంజీవరెడ్డి రెడ్డి కులానికి చెందినవారు కాగా సంజీవయ్య దళితులు. సంజీవయ్య తరువాత సంజీవరెడ్డి రెండోసారి సీఎం పదవి చేపట్టి 1964 ఫిబ్రవరి వరకు కొనసాగారు. అనంతరం 1971 వరకు కాసు బ్రహ్మానంద రెడ్డి, 71 నుంచి 73 వరకు పీవీ నరసింహరావు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. వీరిలో కాసుది రెడ్డి కులం కాగా పీవీ బ్రాహ్మణ కులానికి చెందినవారు.
అనంతరం 1973 జనవరి నుంచి డిసెంబర్ 10 వరకు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగింది. రాష్ట్రపతి పాలన ముగిసిన తరువాత జలగం వెంగళరావు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వెలమ కులానికి చెందిన నేత. తర్వాత తెలంగాణ ప్రాంతానికి చెందిన మర్రి చెన్నారెడ్డి, టంగుటూరు అంజయ్య సీఎం అయ్యారు. వీరిలో మర్రి చెన్నారెడ్డిది రెడ్డి కులం కాగా టంగుటూరు అంజయ్య ఏ కులానికి చెందినవారనే విషయంలో వేర్వేరు వాదనలున్నాయి. ఆయనది గౌడ కులమని, దళితులని, రెడ్డి అనే వాదనలున్నాయి. అయితే తాను రెడ్డి కులానికి చెందినవాడినని అంజయ్యే స్వయంగా ఓ సందర్భంలో చెప్పారని అంటారు.
1982లో ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు భవనం వెంకట్రామి రెడ్డి, 1982-83 మధ్య కోట్ల విజయభాస్కర రెడ్డి, 1983-84 లో ఎన్టీఆర్, 1984లో కొద్ది రోజులు నాదెండ్ల భాస్కర రావు, ఆ తర్వాత 1989 వరకు మళ్లీ ఎన్టీఆర్ సిఎంలుగా పనిచేశారు. వీరిలో భవనం, కోట్ల రెడ్డి కులానికి చెందినవారు కాగా ఎన్టీఆర్, నాదెండ్ల కమ్మ కులస్తులు. 1990 నుంచి 95 మధ్య కోట్ల, ఎన్టీఆర్ మళ్లీ సీఎంలుగా పనిచేశారు.
అనంతరం 1995లో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. చంద్రబాబు తరువాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆ పదవిని చేపట్టారు. చంద్రబాబుది కమ్మ కులం కాగా వైఎస్ రెడ్డి కులానికి చెందిన నాయకుడు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో ఆయన కేబినెట్లో ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. రోశయ్య వైశ్య కులానికి చెందినవారు. తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యారు.
2014లో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ జరిగి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణకు తొలి సీఎం అయిన కేసీఆర్ వెలమ కులానికి చెందినవారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకునే స్థాయిలో సీట్లు సాధిస్తుందా.. సీట్లు సాధిస్తే ఇచ్చిన మాట ప్రకారం బీసీని సీఎం చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే.
Discussion about this post