నిత్యం వార్తల్లో ఉండే ప్రపంచ కుబేరుడు, యూత్ ఐకాన్ ఎలాన్ మస్క్ మరో సంచలనం సృష్టించబోతున్నారు. త్వరలోనే ఆయన జీవిత చరిత్ర తెరకెక్కనుంది. ఈ బయోపిక్ పై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆయన జీవిత చరిత్ర పుస్తకంగా వచ్చిన సంగతి తెలిసిందే. మస్క్ బయోగ్రఫీని ప్రఖ్యాత అమెరికన్ రచయిత వాల్టర్ ఐజాక్సన్ రచించారు.
ఎలాన్ మస్క్ బయోపిక్ తీసేందుకు రెడీగా ఉన్నట్లు ఏ24 అనే చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఇప్పటికే బయోగ్రఫీ రచయిత నుంచి హక్కులను సొంతం చేసుకుంది. ఈ బయోపిక్ ను ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ డారెన్ ఆరోన్సోస్కీ తెరకెక్కించనున్నారు. కానీ మస్క్ పాత్రలో ఎవరు నటిస్తారనేది ఇంకా వెల్లడి కాలేదు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ జీవిత విశేషాలను తెలుసుకోవటం ఆసక్తికరంగా ఉంటుంది.
ఎలాన్ మస్క్ దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో పుట్టాడు. తల్లి మేయ్ మస్క్.. తండ్రి ఎరోల్ మస్క్. వీరిది సంపన్న కుటుంబం. కానీ ఎలాన్ కి పదేళ్లయినా రాకముందే తల్లిదండ్రులు విడిపోయారు. తండ్రి వద్ద ఉన్న ఎలాన్ ఆయనతో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ఆయనే చెప్పాడు.
సమస్యలను తట్టుకోలేక వీడియో గేమ్స్‌కు అలవాటు పడిన మస్క్ బ్లాస్టర్ అనే సరికొత్త వీడియో గేమ్‌ను రూపొందించాడు. దాన్ని 500 డాలర్లకు అమ్మాడు. మంచి కెరీర్ కోసం అమెరికా వెళ్లాలనుకున్నాడు. నిర్బంధ సైనిక శిక్షణను తప్పించుకోవడానికి… ప్రిటోరియా విశ్వవిద్యాలయంలో సీటు సంపాదించాడు. కెనడా పాస్‌పోర్ట్ లభించగానే సరిహద్దులు దాటేశాడు. రెండేళ్ల తర్వాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరి ఆర్థిక, భౌతిక శాస్త్రాల్లో డిగ్రీలు సంపాదించాడు.
ఇంటర్నెట్ విప్లవాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించుకున్న ఎలాన్ తమ్ముడు కింబల్‌తో కలిసి ‘జిప్2’ అనే సాఫ్ట్ వేర్ కంపెనీని స్థాపించాడు. జిప్2 మార్కెట్లో మంచి పేరు తెచ్చుకుంది. 1999లో దాన్ని ప్రముఖ కంప్యూటర్ సంస్థ కాంపాక్ 307 మిలియన్ డాలర్లకు కొనుక్కొంది. తర్వాత ఎక్స్.కామ్ పేరుతో ఒక ఆన్లైన్ పేమెంట్ సంస్థను మొదలుపెట్టాడు. దీనిని కన్ఫినిటీ అనే సంస్థకు దాన్ని అమ్మేశాడు. తర్వాత ఆ సంస్థే లక్షల కోట్ల రూపాయల ఆన్లైన్ లావాదేవీలను శాసిస్తున్న పేపాల్ గా రూపాంతరం చెందింది.
టెస్లా సంస్థ స్థాపనతో ఎలాన్ మస్క్ దశ తిరిగింది. తొలినాళ్లలో ఇబ్బందులు పడినా తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ప్రస్తుతం అది ట్రిలియన్ డాలర్ల కంపెనీ! తర్వాత అంతరిక్ష మార్కెట్ ను టార్గెట్ గా చేసుకుని స్పేస్ ఎక్స్ సంస్థను స్థాపించాడు. 2008లో ఫాల్కన్-1 కక్ష్యను చేరుకున్న తొలి ప్రైవేట్ రాకెట్‌గా చరిత్ర సృష్టించింది. క్రమంగా అంతరిక్ష రంగంలో ఉన్న ‘తొలి’ ప్రైవేట్ రికార్డులన్నీ స్పేస్ ఎక్స్ పరమయ్యాయి.
తర్వాత మస్క్ దృష్టి పాతాళం మీద పడింది. లాస్ ఏంజెల్స్ ట్రాఫిక్‌తో విసిగిపోయిన ఎలాన్ సొరంగ మార్గాలు నిర్మించాలనుకున్నాడు. దీనికోసం ‘ద బోరింగ్ కంపెనీ’ ని స్థాపించాడు. ప్రస్తుతం హాత్రోన్, లాస్ వెగాస్ వంటి చోట్ల సొరంగాలు తవ్వుతోంది ఈ కంపెనీ. శాన్ హోసె, ఫ్లోరిడా ప్రభుత్వాలతోనూ చర్చలు జరుపుతోంది.
వ్యక్తిగత విషయాలకు వస్తే తొలుత జస్టిన్ విల్సన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఐదుగురు పిల్లలు. వీరిలో కవలలు, ట్రిప్లెట్లు ఉండటం విశేషం. 2008లో జస్టిన్ నుంచి విడిపోయాడు. తర్వాత 2010లో ఇంగ్లీష్ నటి తలులా రిలేను వివాహం చేసుకున్నాడు. 2016 లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. తర్వాత అమెరికన్ నటి అంబర్ హర్డ్ తో డేటింగ్ చేసి ఏడాది తరువాత విడిపోయారు. 2018 మే నుంచి సంగీత కళాకారిణి గ్రిమ్స్ తో సహజీవనం చేసాడు. వారికి ఓ కుమారుడు ఉన్నాడు.
Discussion about this post