తెలంగాణలోని దళితుల సర్వతోముఖాభివృద్ధికి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు పథకం సత్ఫలితాలను ఇస్తోందని అధికార బీఆర్ఎస్ తోపాటు కొన్ని అధ్యయన సంస్థలు చెబుతున్నాయి. కానీ గ్రామాల్లో దళిత బంధు ఎంపిక పెద్ద ప్రహసనంగా మారుతోందని, అనర్హులకే ఈ పథకం అందుతోందని ప్రతిపక్షాలతోపాటు కొన్ని సామాజిక సంస్థలు అంటున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పథకంపై వస్తున్న అనుకూల వాదనలు, విమర్శలు, భిన్నాభిప్రాయాలను తెలుసుకుందాం..
దళితుల్లో ఆర్థిక సాధికారత, స్వావలంబన సాధించేందుకు దళిత బంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం కింద ఒక్కో నిరుపేద దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తోంది. దీని ద్వారా దళితులను పారిశ్రామికవేత్తలుగా మార్చాలన్నది లక్ష్యం. దేశంలో అతిపెద్ద నగదు బదిలీ పథకం ఇదే కావడం విశేషం. దీనికి రూ.లక్ష కోట్ల వరకు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు.
బ్యాంకు లింకేజీ లేకుండా, వందశాతం గ్రాంటుగా అర్హత గల ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని అందించడమే లక్ష్యం. ఈ పధకాన్ని 2021 ఆగస్టులో సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభించారు. తర్వాత హుజూరాబాద్ నియోజకవర్గంలో 18,025 కుటుంబాలను గుర్తించి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేశారు.
ఈ పథకం దళితులతోపాటు ఇతరులకు కూడా ఉపాధి కల్పిస్తోందని సెంటర్ ఫర్ ఎకనమిక్ సోషల్ స్టడీస్ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. లబ్ధిదారులందరూ వివిధ యూనిట్లను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నారని తేలింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో పథకం అమలు తీరు, ప్రభావాన్ని తెలుసుకొనేందుకు సెస్ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నియోజకవర్గంలో 18,025 దళితబంధు లబ్ధిదారులుండగా సర్వే కోసం 16,149 యూనిట్లను సెస్ ఎంపిక చేసింది. వీటిలో 14,879 వ్యక్తిగత యూనిట్లు, 1270 గ్రూప్ యూనిట్లున్నాయి.
దళితబంధు పథకం దళితుల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొస్తున్నట్టు సెస్ అధ్యయనం వెల్లడించింది. కోళ్ల ఫారాలు, సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు, ఫొటో స్టూడియో యూనిట్లు మెరుగ్గా పనిచేస్తున్నాయని తెలిపింది. 85 శాతం మంది పారిశ్రామికవేత్తలు తమ ఉత్పత్తులు, సేవలను నేరుగా మార్కెట్లోని తుది వినియోగదారులకు విక్రయిస్తున్నట్టు చెప్పారు. 16,149 యూనిట్ల ద్వారా దళిత కుటుంబాలకు చెందిన 19,042 మందితోపాటు మరో 4,372 మంది ఇతర కూలీలు ఉపాధి పొందుతున్నారని సెస్ వెల్లడించింది.
ప్రతి కూలీకి నెలకు సగటున రూ.23,656 వేతనం చెల్లిస్తున్నారని సెస్ తెలిపింది. డైరీ, పౌల్ట్రీ, పేపర్ ప్లేట్ తయారీ, మినీ సూపర్ బజార్లు, కిరాణా దుకాణాలు, టెంట్‌హౌస్ లాంటి యూనిట్లు ఒకటికంటే ఎకువ కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్నాయని వివరించింది. 50 శాతానికిపైగా పారిశ్రామికవేత్తలు తమ యూనిట్లను విస్తరించాలని భావిస్తున్నారని, కొత్త రకం ఉత్పత్తులను మారెట్లో ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకొంటున్నారని సర్వేలో తేలింది. దళితబంధు పొందిన కుటుంబాల్లో 94 శాతం మంది వార్షిక గృహఆదాయం పెరిగిందని సెస్ అధ్యయనం వెల్లండించింది.
మరోవైపు దళిత బంధు పథకం అమలు తీరు, లభ్డిదారుల ఎంపిక విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గానికి వంద మందిని ఎంపిక చేయాల్సి ఉండగా, వీరిని ఎవరు… ఎలా … ఎంపిక చేస్తారన్న విషయం వివాదంగా మారుతోంది. కుల వివక్ష పోరాట సమితి అంచనా ప్రకారం రాష్ట్రంలో 18 లక్షలకు పైగా దళిత కుటుంబాలు ఉండగా, వారందరికీ దళిత బంధు ఇవ్వడానికి లక్షా 80 వేల కోట్లు అవసరమవుతాయి. ఈ నిధులను ఎలా సమకూరుస్తారనే ప్రశ్నగట్టిగా వినిపిస్తోంది. వాస్తవానికి ఈ పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందు ప్రకటించడంతో, ఆ ఎన్నికల కోసం వేసిన ఎత్తుగడగానే అందరూ చూశారు.
కేవలం అధికార పార్టీకి చెందిన కార్యకర్తలకే దళితబంధు ఇస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశంపై పలువురు హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై విచారించిన న్యాయస్థానం…. ఎమ్మెల్యేల ప్రమేయంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంపిక బాధ్యతలతో వారి ప్రమేయమే ఉండొద్దని స్పష్టం చేసింది. అయినా పరిస్థితిలో మార్పు రాలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
సాధారణంగా ఏ ప్రభుత్వ పథకానికైనా లబ్ధిదారుల ఎంపిక కోసం కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి. ఆ నిబంధనల ప్రకారం ఎంపిక జరగాలి. కానీ దళిత బంధుకు ఏ మార్గదర్శకాలూ లేవని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. దీంతో ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్థానిక రాజకీయ నాయకులు, అధికారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని విమర్శిస్తున్నాయి. ఫలితంగా నిజమైన అర్హులకు పథకం అందటం లేదంటున్నాయి. లబ్ధిదారుల్లో ప్రజా ప్రతినిధుల కుటుంబ సభ్యులు, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు, కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యేల అనుచరులు ఉంటున్నారని చెబుతున్నారు.
ప్రతిపక్షాల విమర్శలను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తోసిపుచ్చారు. లబ్ధిదారుల ఎంపికకు కమిటీలు ఉన్నాయని చెప్పారు. కమిటీలో ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఉంటారని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు, అలాగే రాష్ట్ర స్థాయి కమిటీ ఉన్నాయని వెల్లడించారు. అయితే ఈ కమిటీలకు మార్గదర్శకాలు ఏమీ లేవని చెప్పారు. నిరుపేద కుటుంబాలు, 65 ఏళ్ల లోపు వారిని ఎంపిక చేయాలని చెప్పినట్టు తెలిపారు.
లబ్ధిదారుల నుంచి కొందరు నేతలు, అధికారులు కమీషన్లు తీసుకుంటున్నట్టు వస్తున్న ఆరోపణలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఖండిస్తున్నారు. ఈ పథకంలో డబ్బు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి చేరుతుందని, ఆ డబ్బును కూడా ఫ్రీజ్ చేస్తారని తెలిపారు. వారు ఎంపిక చేసుకునే వ్యాపారాన్ని బట్టి, ప్రభుత్వం సూచించిన ఏజెన్సీలలోనే వారు ఆ వ్యాపారానికి అవసరమైన వాటిని కొనుక్కోవాల్సి ఉంటుందని, వాటిని చెక్ చేశాకే నేరుగా ఏజెన్సీలకు చెల్లింపులు జరుగుతాయని వివరించారు. ఇక్కడ డబ్బులు చేతులు మారటానికి అవకాశమే లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకం అధికార బీఆర్ఎస్ కు ఎంత వరకు మేలు చేస్తుందో.. వేచి చూడాలి.
Discussion about this post