అప్పుడపుడు తన చేతలు.. వ్యంగ్యాస్త్రాలతో వార్తల్లోకి వచ్చే సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఈసారి కాంగ్రెస్ పై సెటైర్ వేశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో అయన పోస్ట్ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. వామపక్షాలతో పొత్తుకు సై అన్న కాంగ్రెస్ అధిష్టానం సీట్ల కేటాయింపుపై ఇంకా క్లారిటీ ఇవ్వక పోవటంతో నారాయణకు కోపమొచ్చింది.
గతంలోనూ నారాయణ చేసిన కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. లిక్కర్ స్కాం కేసులో కోర్టుకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ కుమార్తె కవిత హాజరుకాకపోవడంపై నారాయణ కామెడీ కామెంట్ చేసారు. ఇంట్లో కూరగాయలు కోయడంలో బిజీగా ఉండటం వల్లే కవిత కోర్టుకు హాజరు కాలేకపోయారని నారాయణ అప్పట్లో కామెంట్ చేసారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. మరో సందర్భంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగితే దేశం ఉత్తర, దక్షిణ భాగాలుగా విడిపోవడం ఖాయం అని వ్యాఖ్యానించి వివాదం రేపారు. గతంలో గాంధీ జయంతి రోజున ఆయన చికెన్ తినడంపై వార్తలు రావడంతో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తాజాగా కాంగ్రెస్-కమ్యూనిస్టుల పొత్తును ఉద్దేశించి ఎక్స్ వేదికగా నారాయణ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నిశ్చితార్డం అయ్యాక ఇంకో అందమయిన అమ్మాయి గాని అబ్బాయి గాని దొరికితే లగేస్కుని పోవడం వ్యక్తి జీవితంలో అక్కడక్కడా జరగచ్చేమో…. మరి వ్యవస్థను కాపాడే తాజా రాజకీయాలలో కూడా జరిగితే ఎలా? అని నారాయణ ప్రశ్నించారు. ”ఆల్రెడీ లెఫ్ట్ పార్టీలకు కేటాయించిన సీట్లను కొత్త వారు జాయిన్ అవ్వగానే వాళ్లకు ఇవ్వడం ఏంటని నిలదీశారు.
సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు స్థానాలు, సీపీఎంకు మిర్యాలగూడ, వైరా స్థానాలు ఇస్తామని గతంలో కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సీపీఐ, సీపీఎంకు కేటాయిస్తామన్న ఈ నాలుగు స్థానాల్లో దాదాపు అన్నింటినీ ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చే పరిస్థితి లేదన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ పొత్తు కుదిరినా ఈ స్థానాలు ఇస్తారన్న నమ్మకం లేదు. దీంతో కామ్రేడ్లలో తర్జనభర్జన జరుగుతోంది.
మరో వైపు కాంగ్రెసుతో పొత్తుపై సిపిఐ, సిపిఎం సభ్యులు కొందరు తీవ్రంగా మండిపడుతున్నారని తెలుస్తోంది. అప్పుడు బీఆర్ఎస్తో కలిసి పనిచేసి, ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తుకు పాకులాడుతుండటంతో ప్రజల్లో చులకన అయిపోతున్నామని వాపోతున్నారని అంటున్నారు. పొత్తు కారణంగా రెండేసి స్థానాల్లో పోటీకి సిద్ధమవుతుంటే.. ఇప్పుడు పొత్తు కుదరక పొతే 15 స్థానాల్లో పోటీ చేయాలంటే ఎలా సన్నద్ధం కాగలమని సీపీఎం శ్రేణులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
Discussion about this post