ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. కానీ ప్రైవేటు రంగంలో మాత్రం రిజర్వేషన్లు కల్పించడం వివాదాలకు కారణమవుతోంది. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెడుతూ హైకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు రంగంలో 75 శాతం స్ధానిక కోటా కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం మూడేళ్ల క్రితం తీసుకున్న నిర్ణయాన్ని పంజాబ్, హర్యానా హైకోర్టు కొట్టేసింది.
నెలవారీ జీతం రూ.30,000 కంటే తక్కువ వేతనాలతో 75 శాతం ప్రైవేట్ రంగ ఉద్యోగాలు స్ధానికంగా నివసిస్తున్న వారు లేదా నివాస ధృవీకరణ పత్రం కలిగి ఉన్న వారికి కేటాయించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే స్ధానికులుగా నిర్ధారించేందుకు గతంలో ఉన్న 15 ఏళ్ల కాలాన్ని ఐదేళ్లకు తగ్గించారు. హర్యానాలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో ఈ ప్రైవేటు రంగంలో స్ధానిక ఉద్యోగాల కోటాతో లబ్ది పొందాలని బీజేపీ-జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం భావించింది. అయితే హైకోర్టు నిర్ణయంతో ఇప్పుడు ఆ చట్టం కాస్తా రద్దయింది.
స్థానికుల ఓట్లను ఏకీకృతం చేసే లక్ష్యంతో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టేయడం పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసేందుకు సిద్ధమవుతోంది.
Discussion about this post