ఎవరి సెంటిమెంట్లు వారివి.. ఎవరి అదృష్టం వారిది.. ఎన్నికల నేపథ్యంలో మంచి ముహూర్తంలో నామినేషన్ వేస్తే విజయం సాధ్యమైనట్టేనని బలంగా నమ్ముతారు చాలామంది నేతలు. బీ ఫామ్ అందుకోవడం మొదలుకొని నామినేషన్ పత్రాలపై సంతకం పెట్టే వరకు శుభఘడియలు చూసుకుంటారు. దీంతో ఎన్నికల సమరంలో ఓటరు కన్నా ముందుగా నాయకుణ్ని అనుగ్రహించాల్సింది పండితులే అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.. ఈ నెల 3 నుంచి నామినేషన్లు మొదలైనా.. రేపు, ఎల్లుండి మంచి మహుర్తాలు ఉండటంతో ఎక్కువ నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం మొదలై వారం రోజులు అయ్యింది క్యాడర్ నుంచి లీడర్ వరకు అందరిలోనూ ఒకటే టెన్షన్. నామినేషన్ దాఖలు చేయడానికి సుముహూర్తం ఎప్పుడాని. నేతలు తమ జాతకాలకు సరిపడా తేదీలను ఖరారు చేసుకోడానికే ప్రాధాన్యమిస్తున్నారు . తమ ముహూర్త బలంతో ప్రత్యర్థి చిత్తవ్వాలని, రికార్డు మెజారిటీ సాధించాలని కోరుతూ బలమైన యోగంతో కూడుకున్న ముహూర్తం ఖరారు చేయాల్సిందిగా పండితులను ఆశ్రయిస్తున్నారు. మంచి ముహూర్తాలను ఫైనల్ చేసుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 3 నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. పదో తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. ఐతే తొలి నాలుగు రోజులు పెద్దగా ముహూర్త బలం లేకపోవడంతో చివరి రెండు రోజులూ బలమైన ముహూర్తాలు ఉండటంతో ఆ రోజుల కోసం వేచిచూస్తున్నారు నేతలు.
నామినేషన్ల ప్రక్రియ మొదలైన మూడో తేదీన ఆశ్వయుజ బహుళ షష్ఠి ఆ రోజు విశేషంగా ఉన్నా.. తిథి ఓ మోస్తరుగా ఉండటంతో రాష్ట్రంలో కేవలం 100 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. 4వ తేదీ సప్తమి తిథి, శనివారం, పుష్యమి నక్షత్రం కలిసి రావడంతో మొత్తం 119 నియోజకవర్గాలకు 140 నామినేషన్లు మాత్రమే వేశారు. 5వ తేదీ ఆదివారం సెలవు కాగా, ఆరో తేదీ అష్టమి, నవమి తిథులు పడటంతో సెంటిమెంట్ లేని వారు మాత్రమే నామినేషన్లు వేశారు. దీంతో నామినేషన్లు మొత్తం 211 దాఖలయ్యాయి. ఇక ఏడో తేదీ మంగళవారం కావడంతో 281 నామినేషన్లు నమోదయ్యాయని అధికారులు తెలిపారు.
ఇక తొమ్మిదో తేదీ గురువారం… ఆ రోజు ఏకాదశి కావడం, రాజకీయ కారకుడైన రవి నక్షత్రమైన ఉత్తర నక్షత్రం ఉండటంతో ఆ రోజు నామినేషన్ వేసేందుకు ముహూర్తం దివ్యంగా ఉందని అంటున్నారు పండితులు. తొమ్మిది సంఖ్య కూడా అదనపు బలాన్ని ఇస్తుంది అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా 9వ తేదీనే కామారెడ్డి, గజ్వేల్ నుంచి నామినేషన్లు వేశారు .. చివరి రోజు పదో తేదీ శుక్రవారం కూడా హస్త నక్షత్రం ఉండటంతో ఆ రోజు కూడా నామినేషన్లు భారీగా నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు పండితులు.
Discussion about this post