సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసిన మెగాస్టార్ చిరంజీవి సడన్ గా ప్లాన్ మార్చేశారు. ఇటీవల వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెట్టడంతో కొత్త ప్రాజెక్టు ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భోళా శంకర్ ఫెయిల్యూర్ తరువాత గ్యాప్ తీసుకున్న చిరంజీవి మళ్లీ బిజీ అవుతున్నారు.ఇప్పటికే మూవీ నంబర్ 156ను లాంచనంగా ప్రారంభించిన చిరంజీవి డిసెంబర్ నుంచి ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్‌కు రెడీ అవుతున్నారు. ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తో పక్కాగా హిట్ కొట్టాలని గట్టిగా పిక్స్ అయ్యారు.
గతంలో జగదేక వీరుడు అతిలోక సుందరి, అంజి లాంటి ఫాంటసీ సినిమాల్లో చిరంజీవి నటించారు. వీటిలో జగదేక వీరుడు అతిలోక సుందరి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాను కె రాఘవేంద్రరావు డైరెక్ట్ చేశారు. ప్రముఖ రచయితలు జంధ్యాల, యండమూరి వీరేంద్ర నాథ్ లు పకడ్బందీ గా స్క్రిప్ట్ తయారు చేశారు. 1990 లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో 15 కోట్లు వసూలు చేసింది.
అమ్మోరు సినిమా తీసి హిట్ అందుకున్న ఎమ్మెస్ రెడ్డి కుమారుడు శ్యాంప్రసాద్ రెడ్డి తీసిన ‘అంజి’ ఫాంటసీ సినిమా వసూళ్ళలో బాగా నిరాశపరిచింది. 1998 లో ప్రారంభమైన ఈ చిత్రం ఆరేళ్ళ సుదీర్ఘకాలం పాటు నిర్మాణం జరుపుకుని 2004 లో విడుదలైంది. ఈ సినిమాను కోడి రామకృష్ణ డైరెక్ట్ చేశారు. ఈ క్రమంలో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంచనాలకు తగిన రీతిలో సినిమా లేకపోవడంతో ప్రేక్షకులు.. అభిమానులు నిరాశపడ్డారు.ఈ సినిమాకు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో జాతీయ పురస్కారం లభించింది. ఇవే కాక కెమెరా, మేకప్ విభాగాల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారాలు లభించాయి.
చాలాకాలం తరువాత మరోసారి అదే జానర్ సినిమా తీస్తున్న క్రమంలో గత అనుభవాల దృష్ట్యా ఎలాంటి పొరపాటు జరగకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు చిరంజీవి. కథా పరంగా లోపాలు లేకుండా స్క్రిప్ట్ వర్క్ కే చాలా టైమ్ తీసుకున్నారు. భోళా శంకర్ రిలీజ్ కన్నా ముందే వశిష్ట దర్శకత్వంలో ఫాంటసీ డ్రామాను ఒకే చేశారు మెగాస్టార్. కానీ అప్పటికే ఆచార్య, గాడ్ ఫాదర్ లు అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయకపోవటంతో ఆ స్క్రిప్ట్ మీద రీ వర్క్ చేయటం మొదలు పెట్టారు..
భోళా శంకర్ కూడా నిరాశపరచటంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు చిరంజీవి. స్ట్రిప్ట్ తో పాటు లుక్స్, కాస్ట్యూమ్స్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే ఇలా ప్రతీ విషయాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నారు. అన్ని ఓకే అనుకుంటేనే సెట్స్ మీదకు వెళ్లాలన్నది చిరు ప్లాన్. రీసెంట్గా ఫైనల్ నేరేషన్ వినిపించిన వశిష్ట, మెగాస్టార్ దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. దీంతో డిసెంబర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ఈసినిమాతో మరోసారి హిస్టరీ రిపీట్ చేయాలన్నది మెగాస్టార్ ఆలోచన గా ఉన్నట్టు తెలుస్తోంది. బింబిసార సినిమా తో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వశిష్ట, రెండో సినిమాతోనే చిరును డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశారు. రెండో సినిమాకు కూడా తనకు బాగా కలిసొచ్చిన ఫాంటసీ కాన్సెప్ట్ నే ఎంచుకున్నారు.ఈ సినిమా తో హిట్ కొడితే షార్ట్ టైమ్‌లోనే పెద్ద దర్శకుల సరసన ఆయన చేరిపోతారు. అందుకే చిరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని వశిష్ట కృషి చేస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు కాలేదు.
Discussion about this post