మన దేశంలో సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావాలన్న ఆలోచన మొదట కాంగ్రెస్ చేసింది అనుకుంటారు. కానీ ఆ ఆలోచన మాజీ ప్రధాని వీపీ సింగ్ ది. ఆయన ఎక్కువకాలం పదవిలో కొనసాగక పోవడంతో .. అది ముందుకు సాగలేదు. ఆతర్వాత 1994లో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ ప్రారంభించి RTI కావాలని మొదటిసారిగా క్షేత్రస్థాయిలో పోరాటం చేసింది అరుణారాయ్ అనే సామాజిక కార్యకర్త. మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన ను అరుణారాయ్.. నిఖిల్ డే..శంకర్ సింగ్ లు కలసి స్థాపించారు.
శ్రీమతి అరుణారాయ్ ఐఏఎస్ చేసి కలెక్టర్ గా చేస్తూ తన ఉధ్యోగ నిర్వహణలో పేదలకు, అణగారిన వర్గాలకు దక్కాల్సిన పథకాలు దక్కటల్లేదని గమనించారు. ఉధ్యోగానికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి, పేదల తరఫున తన గొంతు వినిపించడానికి ముందుకొచ్చారు. అప్పట్లో ఆమెకు తోడుగా నిలిచిన నిఖిల్ డే .. గ్రామీణులకు స్వదేశంలో జరుగుచున్న అన్యాయాలపై పోరాడాలనే తపనతో విదేశీ విద్యకు స్వస్తిచెప్పి ఇండియాకొచ్చారు. ఇక శంకర్ సింగ్ ఈయన దాదాపు 17 ఉధ్యోగాలను తృణ ప్రాయంగా వదిలేసిన వ్యక్తి. ఈ ముగ్గురూ కలసి రాజస్థాన్లోని దేవదుంగారి గ్రామంలో మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ తరపున చేసిన ఉద్యమమే .. తర్వాత కాలంలో సమాచార హక్కు చట్టం 2005 అమలుకు దారితీసింది..
ప్రభుత్వ సంస్థల నుండి పారదర్శకత .. జవాబుదారీతనం కోసం పౌరులకు అధికారం కల్పించే చట్టమే ఈ సమాచార హక్కు చట్టం. రాజస్థాన్ పేద ప్రజల దోపిడీకి వ్యతిరేకంగా చేసిన సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఈ చట్టం ఏర్పడింది. భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా .. పంజాబ్ వంటి రాష్ట్రాలు దీనిని అనుసరించాయి.. అనంతరం దేశవ్యాప్తంగా విస్తరించింది.
నాడు మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ సంస్థ ప్రజల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాడింది. సన్నకారు రైతులు, భూమిలేని కార్మికులు, ప్రజలతో కలసి సామాజిక న్యాయం.. జవాబుదారీతనం కోరుతూ ఉద్యమం చేపట్టింది.మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ ప్రచారాలు. పార్టీ నిబద్ధతను స్ఫూర్తిగా తీసుకుని దేశంలో.. ప్రపంచంలో మరెన్నో ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. అందుకే ఆ ముగ్గురిని మనం ఎప్పుడూ అభినందించాల్సిందే.
RTI బిల్లును 15 జూన్ 2005న భారత పార్లమెంటు ఆమోదించింది. 12 అక్టోబర్ 2005 నుండి అమలులోకి వచ్చింది. ప్రతిరోజు సగటున 4800 RTI దరఖాస్తులు సమాచారం కోరుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో దాఖలవుతుంటాయి. సమాచార హక్కు చట్టం ప్రజలకు అవసరమైన సమాచారాన్నిఅందించేందుకు అనుమతిస్తుంది. 2005 నుంచి లక్షలాది మంది భారతీయులు.. ప్రభుత్వ శాఖలు.. అధికారుల నుండి సమాచారాన్ని కోరడానికి RTI చట్టాన్ని ఉపయోగించారు.
Discussion about this post