కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న సలార్ సినిమా రెండు పార్టులుగా ప్రేక్షకులను అలరించబోతోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్ బాగా ఆకట్టుకున్నాయి. టీజర్ వైరల్ అయి కేక పుట్టిస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే సినిమా టికెట్ రేట్లు పెరగనున్నాయన్న వార్తలు ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.
సలార్ టికెట్ రేట్ల పెంపుదల కోసం అవసరమైన అనుమతుల కోసం నిర్మాతలు ప్రయత్నాలు ప్రారంభించారని చెబుతున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేసినట్టు తెలుస్తోంది. టికెట్ ధరని 50 నుంచి 75 రూపాయల వరకు పెంచుకునే సౌలభ్యం కల్పించి.. ఐదు షోలకు అనుమతులు ఇవ్వాలని నిర్మాతలు కోరుతున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి.
గతంలో భారీ బడ్జెట్ సినిమాల టిక్కెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటును రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించిన సంగతి తెలిసిందే. గతంలో వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలకు టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు అనుమతించాలని నిర్మాతలు దరఖాస్తు చేసుకున్నప్పుడు సానుకూల స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఆదిపురుష్ సినిమా టిక్కెట్ ధరలను పెంచుకోవడానికి తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. ఇప్పుడు సలార్ కు కూడా అనుమతులు లభించే అవకాశాలు ఉన్నాయి.
సలార్ లో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషించారు. బాహుబలి సినిమా నుంచి మోకాలి నొప్పితో బాధ పడుతున్న ప్రభాస్ సర్జరీ కోసం యూరప్ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ప్రభాస్ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొననున్నాడని చెబుతున్నారు. సినిమా ట్రైలర్ డిసెంబర్ 1న విడుదల కానుంది. ట్రైలర్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
Discussion about this post