రాజధాని అమరావతిలో ఎన్నికల వేళ కలకలం రేగుతోంది. ఇన్నాళ్లూ మూడు రాజధానులను తెరపైకి తెస్తూ అమరావతిలో అభివృద్ధి పనుల్ని నిలిపేయడంపై జరుగుతున్న చర్చ కాస్తా మరోవైపుకు మళ్ళింది. దీనికి ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయమే ప్రధాన కారణం. ఎన్నికల వేళ ప్రభుత్వం సీఆర్డేయే సాయంతో ఏ ప్లాన్ అమలు చేయబోతోందన్న దానిపై అమరావతి రైతుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
అమరావతిలో రాజధానికి భూములిచ్చిన రైతులకు అప్పట్లో ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద ప్లాట్లు కేటాయించింది. ఈ ప్లాట్లు ఇంకా పూర్తిస్ధాయిలో రైతులకు అందనే లేదు. అంతలోనే కేటాయించిన ప్లాట్ల విషయంలో సీఆర్డీయే తాజాగా తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఫ్లాట్లు రద్దు చేసుకోవాలంటూ రైతులకు లేఖలు పంపుతోంది. దీంతో అసలు ఈ ప్లాట్ల రద్దు వెనుక ఏముందని చర్చించుకుంటున్నారు. అసలు సీఆర్డీయే నిర్ణయం వెనుక ఏముందనే దానిపై ఆరా తీస్తున్నారు.
అమరావతి రైతులకు సీఆర్డీయే లేఖలు పంపుతున్న వాటిలో ప్రధానంగా కోర్టు వివాదాలు ఉన్న చోట్ల ఫ్లాట్లు ఉన్నవారే ఉన్నారు. దీంతో ఆయా వివాదాల పరిష్కారం కోసమే ప్రభుత్వం ఈ ప్లాట్లు రద్దు చేసుకోమని కోరుతుందా లేక ఇంకేదైనా వ్యూహం ఉందా అన్న చర్చ జరుగుతోంది. ఇక్కడ ఫ్లాట్లు రద్దు చేసుకుంటే ప్రత్యామ్నాయంగా మరో చోట ఫ్లాట్లు కేటాయిస్తామని సీఆర్డీయే ప్రతిపాదిస్తోంది. అయితే ఇలా ప్రత్యామ్నాయంగా ఎక్కడ, ఎప్పుడు ప్లాట్లు కేటాయిస్తారన్న దానిపై క్లారిటీ లేదు.
ఈ ప్రాంతంలో మొత్తం దాదాపు 3500 మంది రైతులకు సీఆర్డీయే లేఖలు పంపుతోంది. ఈ లేఖలకు సమ్మతి తెలిపేందుకు రైతులు ముందుకు రావడం లేదు. కానీ నాలుగేళ్లుగా ఇలాంటి వివాదాస్పద ప్లాట్లపై తాము అధికారుల చుట్టూ తిరుగుతున్నా పరిష్కారం చూపని ప్రభుత్వం..ఇప్పుడు హఠాత్తుగా ఎన్నికలకు ముందు ఇలాంటి ప్రతిపాదన చేయడంపై రైతులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు అమరావతి నుంచి రాజధాని తరలింపు వ్యవహారంలో స్థానిక రైతులు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గించుకునేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే ఎన్నికల కోణంలో తీసుకుంటున్న ఈ నిర్ణయాలకు స్ధానికంగా ఏ మేరకు సహకారం లభిస్తుందన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. అయితే ఉన్నంతలో అమరావతిలో వివాదాలకు చెక్ పెట్టి ఎన్నికలకు వెళ్లేందుకు జగన్ ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు.
Discussion about this post