ప్రస్తుత టెక్నాలజీ యుగంలో మొబైల్ ఫోన్ లేకుండా రోజు గడవడం లేదు. కేవలం మాట్లాడుకోవడానికే ఫోన్లు పరిమితం కావడం లేదు. ముఖ్యమైన డేటా, ఫోటోలు, వ్యక్తిగత సమాచారం.. ఇలా అన్నింటినీ ఫోన్లోనే సేవ్ చేస్తున్నారు. మరోవైపు ఆర్ధిక లావాదేవీలు ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. దీంతో సైబర్ నేరాలకు ఆస్కారం ఏర్పడుతోంది. కొందరు టెక్ దుండగులు మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి నేరాలకు పాల్పడుతున్నారు. ఫోన్ హ్యాక్ అయితే మీ సమాచారం, ఇతరులతో జరిపిన సంభాషణలు, కెమెరా, మైక్రోఫోన్ ఇలా ప్రతీది హ్యాకర్ల చేతిలోకి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఫోన్ హ్యాక్ అయినట్టు ఎలా తెలుసుకోవాలో చూద్దాం..
టెక్నాలజీపై పెద్దగా అవగాహన లేని వారు కూడా ఫోన్ హ్యాక్ అయిన సంగతిని తేలికగా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఫోన్ అసాధారణంగా వేడెక్కినా…. లేదా ఒక్కసారిగా ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ పడిపోతున్నా ఫోన్ హ్యాక్ అయినట్టు అనుమానించాలని సూచిస్తున్నారు. ఫోన్లో జనరల్ సెట్టింగ్స్.. ప్రధానంగా ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఏమైనా మార్పులు జరిగాయేమో చెక్ చేసుకుంటూ ఉండాలని చెబుతున్నారు. ఒకవేళ మార్పులు జరిగితే వెంటనే అప్రమత్తమవ్వాలని హెచ్చరిస్తున్నారు.
ఫోన్లో సెట్టింగ్స్ మీ ప్రమేయం లేకుండా మారినట్టు గుర్తించగానే నమ్మకస్తుడైన టెక్ మెకానిక్ తో వాటిని రిప్లేస్ చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా డేటా చోరీ కాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. సైబర్ దాడులు ఎక్కువగా సోషల్ మీడియా యాప్స్ ద్వారానే జరుగుతున్నాయని హెచ్చరిస్తున్నారు. పోర్న్ వెబ్సైట్ల కోసం వీపీఎన్‌ను వాడే వారు సైబర్ దాడులకు ఎక్కువగా గురయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
ఇంటర్నెట్, యాప్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని… గూగుల్, యాపిల్ ప్లే స్టోర్ల నుంచే యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం సురక్షితమని చెబుతున్నారు. తెలియని వారి నుంచి వచ్చే మెయిల్స్, మెసేజీలలో ఉండే లింకులను క్లిక్ చేయవద్దని, అటాచ్మెంట్లు డౌన్లోడ్ చేయవద్దని సూచిస్తున్నారు.
ఫోన్లో అప్లికేషన్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం, ఫోన్‌ను ఇతరులకు ఇవ్వకపోవడం ద్వారా హ్యాక్ కాకుండా కాపాడుకునే అవకాశం ఉంటుందని యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ సంస్థలు చెబుతున్నాయి. అవసరం లేనపుడు వైఫై, బ్లూటూత్ లను ఆఫ్ చేయాలని సూచిస్తున్నాయి.
Discussion about this post