నిజం గెలవాలి అంటూ చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేస్తోన్న బస్సు యాత్రకు స్పందన ఫర్వాలేదు. జనాలను బాగానే మొబలైజ్ చేస్తున్నారు.రాజకీయాలను మాట్లాడనంటూ భువనేశ్వరి రాజకీయాలే మాట్లాడుతున్నారు. చంద్రబాబు ను అరెస్ట్ చేసిన తీరు అక్రమం అంటే ఫర్వాలేదు కానీ అసలు అరెస్ట్ అక్రమం అనే రీతిలో భువనేశ్వరి కానీ… టీడీపీ నాయకురాళ్లు కానీ మాట్లాడుతున్నారు. చంద్రబాబు ను రిమాండ్ కి పంపే ముందు స్కిల్ స్కాం కేసులో ప్రాధమిక సాక్ష్యాధారాలు ఉన్నాయనే కదా జైలుకి పంపారు. మరి రిమాండ్ కానీ అరెస్ట్ కానీ అక్రమం కాదు కదా. ఈ లాజిక్ ను మర్చిపోయి న్యాయ వ్యవస్థను కించపరిచేలా భువనేశ్వరి,ఇతర నాయకులూ మాట్లాడుతున్నారు. ప్రజలు ఏమి చెప్పినా నమ్ముతారు కదా అనుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా. ప్రసార సాధనాలు పెరిగిపోయిన క్రమంలో చదువురాని సైతం వారు వీడియోలు చూస్తున్నారు. విషయంపై అవగాహన పెంచుకుంటున్నారు.
చంద్రబాబు కేసుల్లో అసలు ఆధారాలు లేవంటున్నారు భువనేశ్వరి. ఆధారాలు ఉన్నాయో లేవో కోర్టులు చూసుకుంటాయి. కింద కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఎన్ని పిటిషన్లు వేసినప్పటికీ వాటిని కోర్టులు కొట్టివేస్తున్నాయంటే ఎంతో కొంత ప్రాధమిక సాక్ష్యం ఉన్నట్టే కదా. అయినా బస్సు యాత్రలు. బహిరంగసభలకు కోర్టులు స్పందించవు. ఆవిషయం తెలిసి కూడా చంద్రబాబు సూచనలు మేరకు కేవలం రాజకీయం కోసమే భువనేశ్వరి ఈ యాత్రలు చేస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈయాత్ర ప్రత్యేకత ఏమిటంటే
భువనేశ్వరి పక్కన లోకేష్ కానీ బ్రాహ్మణి కానీ లేకపోవడం. దీన్ని బట్టి ఆమె ఒక్కరే హైలెట్ కావాలని బాబు భావిస్తున్నారని చెప్పుకోవచ్చు.
బాబు అరెస్ట్ వార్త విని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను పరామర్శించడం మంచిదే. అందులో తప్పేమి లేదు వారికి ఆర్ధిక సహాయం చేయడం కూడా మంచిదే. 2015 లో రాజమహేంద్రవరంలో జరిగిన గోదావరి పుష్కరాలలో తొక్కిసలాట జరిగి మృతి చెందిన 29 మంది కుటుంబాల సంగతేమిటి ?నాటి ఘటనకు కారణమెవరు? ఇటీవల చంద్రబాబు సభల కారణంగా కందుకూరు, గుంటూరులలో తొక్కిసలాటలు జరిగి పదకొండు మంది మరణించారు. వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించారా! అని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
భువనేశ్వరి ప్రసంగాలను వైసీపీ కార్యకర్తలు, అభిమానులు బాగా ట్రోల్ చేస్తున్నారు కూడా. మొత్తం మీద ప్రజలు అన్ని గమనిస్తున్నారు.భువనేశ్వరి మాటలు వింటున్నారు. కానీ గుంభనంగా ఉంటున్నారు. ఈ యాత్ర బాబుకు ప్లస్ అవుతుందో ? మైనస్ అవుతుందో ? వేచి చూడాలి.
Discussion about this post