తెలంగాణలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. పార్టీలు ప్రచారానికి సిద్దం అవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. కాంగ్రెస్ అధికారం ఖాయమనే ధీమాతో ఉంది. బీజేపీ తామే రేసులో ముందున్నామని చెబుతోంది. ఈ సమయంలోనే తెలంగాణలో నివసిస్తున్న ఏపీకి చెందిన సెటిలర్ల ఓట్ల లెక్కలు కీలకంగా మారుతున్నాయి. వీరంతా ఏపార్టీకి అనుకూలంగా ఓటేస్తారనే అంశం ఆసక్తికరం గా మారింది. ఆ విషయాలేమిటో తెలుసుకుందాం.
తెలంగాణ మొత్తం లో సెటిలర్ల ఓట్లు 36 లక్షల వరకు ఉన్నాయని అంచనా. హైదరాబాద్ లోని కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజిగిరి, మేడ్చల్ నియోజకవర్గాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది. ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లోనూ వీరి ఓటింగ్ కనిపిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు.వీరిలో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉండగా, చెప్పుకోదగిన సంఖ్యలో ఏపీ ప్రాంత వాసులు ఉన్నారు. వారిలో చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ లోనే ఓటర్లుగా కొనసాగుతున్నారు. శేరిలింగం పల్లి, రాజేంద్రనగర్, కూకట్ పల్లి నియోజవర్గాల్లోనే 20 శాతానికి పైగా ఓటర్లు ఉన్నారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి వీరిలో మెజార్టీ ఓటర్లు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నారు.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత వీరిలో మెజారిటీ కమ్మ సామాజిక వర్గం ఓటర్ల ఆలోచనా తీరు మారిందని పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు అరెస్ట్ లో ఏపీ సీఎం జగన్ .. ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్న బీజేపీ అగ్ర నేతలు .. అలాగే కేసీఆర్ కీలక పాత్ర పోషించారని బలంగా నమ్ముతున్నారు. ఆ సామాజిక వర్గంలో ఆ విధమైన ప్రచారం కూడా సాగుతోంది. ఇదే క్రమంలో తెలంగాణ టీడీపీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించడం విశేషం. ఈ నిర్ణయం వెనుక ఈఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ లను ఓడించాలన్న యోచన కూడా ఉందని అంటున్నారు. కాంగ్రెస్ ను గెలిపించండి .. గంపగుత్తగా రేవంత్ కి ఓట్లేయండి అంటూ తెరవెనుక ప్రచారం కూడా చేస్తున్నారు. కమ్మసామాజిక వర్గం ఓట్లు దాదాపు మూడున్నర లక్షల వరకు ఉండొచ్చని అంటున్నారు. వీరిలో కాంగ్రెస్ అంటే గిట్టని వారు ఉండవచ్చు. ప్రస్తుతం తెలంగాణ లో అయిదుగురు కమ్మ సామాజికవర్గ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా బీఆర్ఎస్ తరపున ఎన్నికల బరిలో ఉన్నారు. వీరు చంద్రబాబు ను అభిమానిస్తున్నప్పటికీ వారి సామాజిక వర్గం ఓట్లు తమకే పడాలని కోరుకుంటున్నారు.
ఇక కమ్మ సామాజిక వర్గం కాకుండా మిగిలిన ఓటర్ల లో వివిధ సామాజిక వర్గాల వారున్నారు. వీరిలో వైసీపీ, బీఆర్ఎస్, బీజేపీ,కాంగ్రెస్,ఇతర పార్టీలను అభిమానించే వారున్నారు. వీరిలో ఎందరు..ఎలా చంద్రబాబు అరెస్ట్ పట్ల స్పందిస్తున్నారనేది స్పష్టంగా తెలీదు. ఐటీ ఉద్యోగులు విషయంలో కూడా అంతే.కొంతమంది వేయవచ్చు .. మరికొంతమంది వేయకపోవచ్చు. నేరుగా టీడీపీ బరిలో ఉంటే ఓటు వేయడం వేరే .. ఆ సామాజిక వర్గం సూచించిన వారికి ఓటేయడం వేరే. మొత్తం మీద విశ్లేషించి చూస్తే గంప గుత్తగా సెటిలర్ల ఓట్లు కాంగ్రెస్ కి పడతాయని అంచనావేయలేం. డైవర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు కి మధ్యంతర బెయిల్ రావడం తో ఆయన బయటకు వస్తున్నారు. ఇపుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుని ఎవరికి ఓటు వేయమంటారో తెలీదు. ఏపీలో టీడీపీ తో కొనసాగుతున్న జనసేన తెలంగాణలో బరిలో దిగుతోంది. బీజీపీతో పొత్తు కుదుర్చుకునేందుకు చర్చలు జరుపుతోంది. రేపో మాపో సీట్ల సర్దుబాటు కూడా జరుగవచ్చు. జనసేన ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తో పొత్తు కుదుర్చుకుని తెలంగాణలో బీజేపీ తోకలిసి వెళుతున్న అంశంపై చంద్రబాబు దృష్టి సారించ వచ్చని చెబుతున్నారు.
ఏపీలో ఒంటరిగా పోటీలో నిలబడితే టీడీపీ గెలుపు ఖాయమని పార్టీ నేతలు కొందరు చంద్రబాబుకి చెబుతున్నారు.జనసేనతో ఓకే కాని బీజేపీతో కూడా కలిస్తే అది ఎంతో నష్టం కలిగిస్తుందని, అయిదేళ్లుగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అధికార వైసీపీ తో బీజేపీ పెద్దలు ఏవిధంగా మద్దతుగా నిలిచిందీ వారు ఉదహరిస్తున్నారు. ఇంత జరిగినా బీజేపీ తోనే వెళితే జనంలో ఇప్పటికే ఉన్న నిరసన భావం వ్యతిరేకతగా మారి మళ్లి అధికార వైసీపీ వరంగా మారుతుందని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రస్తుతానికి సస్పెన్స్.
Discussion about this post